ఎలాంటివారిని దైవం అనుగ్రహిస్తుంది ?

ఎవరైతే ఇతరులపట్ల సానుభూతిని కలిగి ఉంటారో ... తమకి హాని చేయడానికి ప్రయత్నించినవారిని సైతం పెద్దమనసుతో క్షమించగలుగుతారో అలాంటివారిని భగవంతుడు అనుగ్రహిస్తాడని చెప్పబడుతోంది. ఇందుకు ఉదాహరణగా శివాజీ జీవితంలోని ఒక సంఘటన కనిపిస్తుంది.

భవానీదేవి భక్తుడైన శివాజీ తన బలపరాక్రమాలను శత్రువుల విషయంలో మాత్రమే ప్రదర్శించేవాడు. నిస్సహాయులపట్ల ... నిర్భాగ్యులపట్ల ఆయన సానుభూతిని కలిగి ఉండేవాడు. అదే విధంగా నిజాయితీకి కట్టుబడినవాళ్లని కూడా ఆయన ఎంతగానో ఆదరించేవాడు. ఒకసారి శివాజీ తన విశ్రాంతి మందిరంలో ఉండగా ఒక యువకుడు హఠాత్తుగా ఆయనపై దాడిచేస్తాడు. చివరి నిముషంలో ఆ యువకుడిని సిపాయిలు అడ్డుకుని బంధిస్తారు.

తనని అంతం చేయడానికి ప్రయత్నించడానికి కారణమేవిటని శివాజీ అడుగుతాడు. తన కుటుంబ పరిస్థితుల గురించి ఆ యువకుడు శివాజీకి వివరిస్తాడు. గత్యంతరంలేని పరిస్థితుల్లో ఆయన శత్రువుల నుంచి తాను సాయాన్ని పొందవలసి వచ్చిందనీ, అందువలన వాళ్లు చెప్పినట్టుగా ఆయనపై దాడిచేయవలసి వచ్చిందని అంటాడు. పరిస్థితుల ప్రభావం వలన తాను అలా చేశాననీ, నిజానికి తనది నేరంచేసే మనస్తత్వం కాదని చెబుతాడు. అతనికి మరణదండన తప్పదని అక్కడి వాళ్లంతా అనుకుంటారు.

యువతకు ఉపాధి కల్పించకపోతే వాళ్ల ఆలోచనా విధానం దారితప్పుతుందని చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనమని శివాజీ భావిస్తాడు. ఆ దిశగా దృష్టిపెట్టి సాధ్యమైనంత తొందరగా ఆ సమస్యను పరిష్కరించమని మహామంత్రిని ఆదేశిస్తాడు. ఆ యువకుడు తనపై దాడికి పాల్పడటం తప్పే అయినా, అందుకుగల కారణాన్ని దాచకుండా చెప్పినందుకు అభినందిస్తాడు. నిజాయితీ పరులు దేశసేవలో తప్పనిసరిగా పాలుపంచుకోవాలని చెబుతూ, ముఖ్యమైన బాధ్యతలను అప్పగిస్తూ తన కొలువులో ఆ యువకుడిని నియమిస్తాడు.

ఆయన తీసుకున్న ఆ నిర్ణయానికి అక్కడివాళ్లతో పాటు ఆ యువకుడు కూడా ఆశ్చర్యపోతాడు. శివాజీ క్షమాగుణానికి చేతులెత్తి నమస్కరిస్తూ, ఇక నుంచి ఆయన చూపిన మార్గంలో నడచుకుంటానని చెబుతాడు. శివాజీ అనేక విజయాలను సాధించడానికి ఆయన ధైర్యసాహసాలు కారణమైతే, అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడు కావడానికి కారణం ఇతరుల పట్ల ఆయనకిగల క్షమాగుణమేనని అక్కడివాళ్లు చెప్పుకుంటారు ... అనేక విధాలుగా ఆయనని ప్రశంసిస్తారు.


More Bhakti News