దిన చర్య

దిన చర్య
ఆధ్యాత్మికతతో ముడిపడిన జీవితమే మనిషిని ఉన్నతమైన స్థాయికి చేరుస్తుందనే విశ్వాసం ప్రాచీనకాలం నుంచి నేటి వరకూ కొనసాగుతోంది. ఉదయం నిద్రలేచింది మొదలు ... రాత్రి నిద్రించేంత వరకూ మానవుడి యొక్క దైనందిన జీవితం ఎలా ఉండాలనేది ధర్మశాస్త్ర గ్రంధాలు వివరించాయి.

ఉదయం నిద్రలేవగానే రెండు అరచేతులు రుద్దుకుని కనురెప్పలు తాకేలా కళ్లపై పెట్టుకోవాలి. అరచేతి పైభాగాన 'లక్ష్మీ దేవి'... మధ్యలో 'సరస్వతీ దేవి' ... మూల భాగంలో 'పార్వతీదేవి' వుంటారు కనుక, ఆ అరచేతులను చూసుకోవాలి. ఇక శ్రీ మహావిష్ణువును భర్తగా పొందిన భూమాతకు కాళ్లతో స్పర్శించడం తప్పు కాబట్టి, తనని క్షమించమని కోరుతూ ... ఆమె అనుమతిని కోరుతూ నేలపై కాళ్లు మోపాలి. తన స్నానపు నీటిని గంగ ... యమున ... గోదావరి జలాలుగా భావన చేసుకుని స్నానం చేయాలి.

ఆ తరువాత ప్రత్యక్ష దైవమైన సూర్యుడికి నమస్కరించి ... ఇష్ట దేవతారాధన చేయాలి. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లవలసి వచ్చినప్పుడు ... తనకి ముందు నరసింహ స్వామి ... వెనుక బలరామ కృష్ణులు ... ఇరువైపులా రామ లక్ష్మణులు తోడుగా వస్తున్నారని అనుకోవాలి. భోజనం చేయడానికి ముందు ... దైవం అనుగ్రహంతో లభించిన పదార్థములు ఆయనకే నివేదన చేస్తున్నామని చెబుతూ ... స్వీకరించమని కోరాలి. భోజనం తరువాత అది త్వరగా జీర్ణమవ్వాలని ప్రార్ధించాలి.

చీకట్లను తొలగిస్తూ వెలుగును ప్రసాదించే సంధ్యా దీపానికి నమస్కరించాలి. తిరిగి పడకగదికి చేరుకున్న తరువాత, ఆ రోజున తెలిసి తెలియక ఏవైనా పాపాలు చేసి వుంటే మన్నించమని ఆ పరమేశ్వరుడిని మనసులోనే వేడుకోవాలి. ఇక నిద్రలో ఎలాంటి చెడు కలలు రాకుండా వుండటం కోసం, హనుమంతుడిని ... గరుత్మంతుడిని ... స్మరిస్తూ నిద్రకి ఉపక్రమించాలి. ఈ విధంగా చేసినట్టయితే దైవం యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.

More Bhakti Articles