ఆవేశం అనర్థం

తన కోపమే తన శత్రువు ... తన శాంతమే తనకి రక్షయని అంటూ వుంటారు. నిజంగానే కోపం అనే శత్రువు మనలోనే ఉంటూ మనల్ని చెడు మార్గం దిశగా మళ్లించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుంది. ఇక శాంతమనేది మనకి ఒక రక్షణ కవచంలా ఉంటూ మంచి మార్గం దిశగా నడిపిస్తూ వుంటుంది. కోపాన్ని జయించినప్పుడే దైవానుగ్రహం లభిస్తుందని మహర్షులు చెప్పారు.

పురాణ గాధలను ... చారిత్రక యుద్ధాలను పరిశీలించినప్పుడు ఈ విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. శాంతం ... సహనం కలిగినవారు ఏ స్థాయికి చేరుకున్నారో, ఆవేశం ... అహంకారం వున్నవారు ఎలా పతనావస్థకు జారిపోయారో తెలుస్తుంది. ఒక రావణాసురుడు ... ఒక కంసుడు ... ఒక దుర్యోధనుడు కేవలం ఆవేశం - అహంకారం వలన దుర్గతులను పొందారు. ఇక విశ్వామిత్రుడు కూడా తన ఆవేశాన్ని ... అహంకారాన్ని విడిచిపెట్టి బ్రహ్మర్షి అనిపించుకోవడానికి ఎంతోకాలం పట్టింది.

కోపం వలన వివేకం ... ఆస్తి పాస్తులు ... అర్థాంగి ... బంధుమిత్రులు ... అంతా దూరమైపోతారు. శాంతం వలన మనసు ప్రశాంత మవుతుంది. ఆ ప్రశాంతత పవిత్రతను సంతరించుకుంటుంది. పవిత్రత వున్న చోట ఉండటానికి భగవంతుడు ఇష్ట పడతాడు. అప్పుడు ఆయన అనుగ్రహాన్ని పొందడం తేలిక అవుతుంది ... ఈ జన్మను సార్ధకం చేసుకునే అవకాశం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

More Bhakti Articles