పాలబిందె - ఉంగరం

వివాహ వేడుక మన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడుతుంటుంది. నూతన వధూవరులను మరింత దగ్గర చేయడానికి ... ఒకరి చొరవను ఒకరు గ్రహించడానికి మన పూర్వీకులు ఎన్నో అంశాలను ఆచారాల జాబితాలో చేర్చారు. అలాంటి వాటిలో పాలబిందెలో నుంచి ఉంగరం తీసే ఆట ఒకటి.

వివాహ సమయంలో వధూవరులిద్దరి చేతికి ప్రధానపు ఉంగరాలు వుంటాయి. అబ్బాయి తరఫువారు ... అమ్మాయి తరఫువారు ఒకరికి ఒకరు చేయించిన ఈ ఉంగరాలను ఒక పాలబిందెలో వేస్తారు. వధూవరులిద్దరూ ఆ పాలబిందె దగ్గర ఎదురెదురుగా కూర్చుని ఉంగరాలను వెదికి పట్టుకోవాలి. ఒకరి ఉంగరం ఒకరికి వస్తే ... ఒకరిపై ఒకరికి ప్రేమ ఎక్కువగా ఉంటుందని భావించేవారు. అయితే ఈ కార్యక్రమమంతా రెండు కుటుంబాలవారి ఉత్సాహంతో ... ప్రోత్సాహంతో సంతోషంగా సందడిగా జరుగుతూ వుంటుంది.

ఈ ఉంగరపు ఆటను లక్ష్మీ నారాయణులు ఆడినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. బహుశా అక్కడి నుంచే మన పెద్దవాళ్లు దీనిని ఆచారంగా గ్రహించి వుంటారు. ఈ ఘట్టానికి సంబంధించిన నమ్మకాలను పక్కన పెడితే, బెరుకుగా ... బిడియంగా ఉండే వధూవరులు తొందరగా కలిసిపోవాలనే ఉద్దేశమే ఈ ఆచారం వెనుక దాగిన అర్థంగా కనిపిస్తోంది.

More Bhakti Articles