అదే సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యేకత !

సుబ్రహ్మణ్యస్వామికి గల శక్తి అపారమైనది. దేవతల సేనా నాయకుడిగా ఆయన ఎంపిక కావడాన్నిబట్టే ఆయన సామర్థ్యాన్ని అర్థంచేసుకోవచ్చు. లోక కల్యాణం కోసం అవతరించిన ఆయన, కార్తికేయుడు ... స్కందుడు ... షణ్ముఖుడు ... కుమారస్వామిగా అనేక నామాలతో శివపార్వతుల ఆశీస్సులు ... దేవతలచే ప్రశంసలు అందుకుంటాడు.

అలాంటి సుబ్రహ్మణ్యస్వామి తన భక్తులను అనుగ్రహించడం కోసం భూలోకంలోని అనేక ప్రాంతాలలో ఆవిర్భవిస్తాడు. అలా ఆయన స్వయంభువుగా కొలువైన క్షేత్రాలు ... మహిమాన్వితమైన దివ్య క్షేత్రాలుగా ప్రసిద్ధిచెందాయి. ఆయురారోగ్యాలను ప్రసాదించేవిగా ... ఐశ్వర్యాన్ని అందించేవిగా ... విజయాలను చేకూర్చేవిగా ఆ క్షేత్రాలు విలసిల్లుతుంటాయి.

కొన్ని క్షేత్రాల్లో సర్పరూపంలో కొలువైన స్వామి, మరికొన్ని క్షేత్రాల్లో ఆరుముఖాలతోను ... వల్లీ దేవసేనలతోను ... అరుదుగా లింగరూపంలోను దర్శనమిస్తూ ఉంటాడు. స్వామి అవతరించిన రోజుగా చెప్పబడుతోన్న 'సుబ్రహ్మణ్య షష్ఠి' రోజున ఆ స్వామిని ఆవుపాలతో అభిషేకించి ఎర్రని పూలతో పూజిస్తుంటారు. ఆయనకి ప్రీతికరమైన పాలు ... పటిక బెల్లం ... అరటిపండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు.

ఈ రోజున ఉపవాసం చేస్తూ స్వామిని ఆరాధించడం వలన, సంతాన సౌభాగ్యాలతో పాటు జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడని చెప్పబడుతోంది. షణ్ముఖుడు అనే పేరుకి తగినట్టుగానే స్వామి ఆవిర్భవించిన ఆరు ప్రధానమైన క్షేత్రాలు తమిళనాడు ప్రాంతంలో కనిపిస్తాయి. వీటిలో 'కుంభకోణం' ఒకటిగా చెప్పబడుతోంది.

సాక్షాత్తు సదాశివుడితోనే స్వామి ఇక్కడ జ్ఞాన సంబంధమైన విషయాలను గురించి సంభాషించాడని అంటారు. అందువలన వివాహయోగం కల్పించేవాడిగా ... సంతాన సౌభాగ్యాలను అందించేవాడిగానే కాదు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడిగా కూడా సుబ్రహ్మణ్యస్వామి దర్శనమిస్తూ ఉంటాడు. భక్తులచే సుబ్బారాయుడని ఆప్యాయంగా పిలిపించుకుంటూ పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు.


More Bhakti News