భక్తులను రక్షించే సుబ్రహ్మణ్యుడు

తమిళనాట సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయాలు ఎన్నో విశేషాలను సంతరించుకుని, అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి. స్వామివారి లీలావిశేషాలను అద్భుతంగా ఆవిష్కరిస్తుంటాయి. అందువలన అనునిత్యం ఈ ఆలయాలను దర్శించే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.

ఈ ప్రాంతంలో చాలామందికి సుబ్రహ్మణ్యస్వామి అనే పేరు ఉండటాన్ని బట్టి, అయనపై వాళ్లకి గల విశ్వాసం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాలను దర్శిస్తున్నప్పుడే ఆయన భక్తుల గురించిన విశేషాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అలాంటి భక్తులలో 'అరుణగిరి నాథర్' ఒకరు.

అనుక్షణం సుబ్రహ్మణ్యస్వామిని కీర్తిస్తూ సేవిస్తూ తరించిన మహా భక్తులలో అరుణగిరి నాథర్ పేరు ముందువరుసలో కనిపిస్తుంది. ఒకసారి ఆయన 'విరాలిమలై'లోని స్వామి దర్శనం చేసుకోవడం కోసం బయలుదేరుతాడు. ఓ అడవీమార్గంలో ఆయన ప్రయాణంచేస్తూ వుండగా క్రూరమృగాలు చుట్టుముడతాయి. దాంతో ఆయన సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్ధిస్తాడు.

అంతే ... ఎక్కడి నుంచో రివ్వున బాణాలు దూసుకురాసాగాయి. దాంతో బెదిరిపోయిన మృగాలు అక్కడి నుంచి పారిపోతాయి. వేటగాడి రూపంలో అక్కడికి వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి, అరుణగిరి నాథర్ కి తోడుగా నిలిచి అతణ్ణి తన క్షేత్రానికి క్షేమంగా చేరుస్తాడు. భగవంతుడిని దర్శించాలనే బలమైన సంకల్పం ఉన్నప్పుడు, ఎలాంటి ఆపదలు ఎదురైనా ఆయనే కాపాడతాడు. వెన్నంటి ఉంటూ క్షేమంగా గమ్యానికి చేరుస్తాడు అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా కనిపిస్తూ ఉంటుంది.


More Bhakti News