నిజమైన సోదర ప్రేమకు నిర్వచనం !

దశరథుడు చనిపోయిన విషయం ... సీతారామలక్ష్మణులు వనవాసానికి వెళ్లిన విషయం భరతుడికి తెలియదు. ఆయన ఆ సమయంలో రాజ్యంలో లేకపోవడమే అందుకు కారణం. రాజ్యానికి తిరిగివస్తూనే ... అంతా విచారంగా ఉండటం చూసిన ఆయనకి మనసు కీడు శంకిస్తుంది.

ఆదుర్దాతో తల్లి మందిరానికి చేరుకున్న ఆయన, జరిగిన ఘోరాన్ని గురించి తెలుసుకుని నిర్ఘాంతపోతాడు. జరిగినదానికి తన తల్లే కారకురాలని తెలిసి తల్లడిల్లిపోతాడు. అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించాలానే కోరిక తనకి ఏనాడూ కలగలేదనీ, ఒకవేళ ఆ కోరికే గనుక వుంటే తనకి ఆ సింహాసనాన్ని రాముడు ఆనందంగా అప్పగించేవాడని అంటాడు.

ధర్మస్వరూపమైన రాముడే ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి అర్హుడనే విషయాన్ని ఆమె అర్థంచేసుకోకపోవడం దురదృష్టమని కన్నీళ్లు పెట్టుకుంటాడు. తన తండ్రి మాట వినిపించని మందిరంలో ... తన రాముడి రూపం కనిపించని రాజ్యంలో తాను ఉండలేనంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోతాడు. తన పరివారంతో కలిసి కొన్నిరోజుల పాటు ప్రయాణించి సీతారామలక్ష్మణులను కలుసుకుంటాడు. జరిగినదానికి తల్లి తరఫున తాను క్షమాపణ చెబుతాడు. తండ్రి మరణవార్తను అతని ద్వారా తెలుసుకున్న రామలక్ష్మణులు బాధపడతారు .. సీత కన్నీళ్ల పర్యంతమవుతుంది.

తనతో పాటు రాజ్యానికి తిరిగి వచ్చేయవలసిందిగా భరతుడు పట్టుపడతాడు. అతని ప్రేమానురాగాలను అర్థంచేసుకున్న రాముడు నచ్చచెబుతాడు. భరతుడి మాట కాదనలేక తన పాదుకలను ఆయనకి ఇస్తాడు. శ్రీరాముడి పాదుకలను తలపై పెట్టుకుని రాజ్యానికి వెళ్లి, వాటిని సింహాసనంపై ఉంచి, సీతారామలక్ష్మణులు తిరిగి వచ్చేంత వరకూ భరతుడు పరిపాలన కొనసాగిస్తాడు. లక్ష్మణుడు తరువాత నిజమైన సోదరప్రేమకు నిర్వచనంలా కనిపిస్తాడు.


More Bhakti News