ద్రాక్షారామం

పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశమే నేడు 'ద్రాక్షారామం'గా విరాజిల్లుతోంది. తన భర్తకి ఆహ్వానం లేకపోయినప్పటికీ, పుట్టింటిపై ప్రేమతో ఆ యజ్ఞానికి వచ్ఛి అవమానంపాలై 'సతీదేవి' ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇదే. తన భార్యను అవమాన పరిచినందుకు గాను వీరభద్రుడిని సృష్టించిన శివుడు, దక్షుడి తల నరికించాడు. సతీదేవి వియోగం నుంచి శివుడిని బయటపడేయడం కోసం, శ్రీ మహా విష్ణువు ఆమె శరీరాన్ని 18 ఖండాలుగా చేశాడు. ఆమె శరీర అవయవాలు పడిన ప్రదేశాలు 'అష్టాదశ శక్తిపీఠాలు'గా అవతరించాయి.

ద్రాక్షా రామంలో శివుడు ... భీమేశ్వరుడిగా స్వయంభువు గా అవతరించాడు. శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ... పంచారామాల్లో ఒకటిగా ... దక్షిణ కాశీగా వెలుగొందుతోన్న ఈ క్షేత్రాన్ని గురించి, శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్తఋషులు కలిసి గోదావరిని తీసుకు వచ్చారనీ, అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని 'సప్త గోదావరి' అని పిలుస్తూ వుంటారు. ఇక్కడి పంచలోహ విగ్రహాలు ... తామ్ర మూర్తులు 8 వ శతాబ్దం నుంచి ఉన్నవిగా కనిపిస్తాయి.

ఈ భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కులలోను ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్టించాడు. తూర్పున 'కోలంక' ... పడమర 'వెంటూరు' ... ' దక్షిణాన 'కోటిపల్లి' ... ఉత్తరాన 'వెల్ల' ... ఆగ్నేయంలో 'దంగేరు' ... 'నైరుతిలో 'కోరుమిల్లి' ... 'వాయువ్యంలో 'సోమేశ్వరం' ... ఈశాన్యాన 'పెనుమళ్ళ' ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు దర్శనమిస్తాయి. ఇక ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో 'ఇంద్రేశ్వర' ... 'యజ్ఞేశ్వర' ... 'సిద్దేశ్వర' ... 'యోగీశ్వర' ... 'యమేశ్వర' ... ' కాళేశ్వర' ... వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి. ఇక తూర్పు ... పశ్చిమ ... ఉత్తర ... దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలి గోపురాన్ని ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థలపురాణం చెబుతోంది.

'భీష్మ ఏకాదశి' రోజున శ్రీ మాణిక్యాంబ సహిత భీమేశ్వరస్వామికి ... లక్ష్మీనారాయణులకు కల్యాణోత్సవం నిర్వహించబడుతుంది. ఇక శివరాత్రి ఉత్సవాలు ... శరన్నవరాత్రులు ... కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇంతటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే పాపాలు పటాపంచలై ... పుణ్య ఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.


More Bhakti News