వరాహావతారం

వరాహావతారం
శ్రీ మహావిష్ణువు అవతార కార్యాలలో ఎక్కడా ఎప్పుడూ తొందరపాటు కనిపించదు. ఏ సమస్యను ఏ అవతారంలో ఎలా పరిష్కరించాలో ఆయనకి బాగా తెలుసు. శత్రువు ఎంతటి వాడైనా వాడి పాపం పండేంత వరకూ సహనం పాటించి, ఆ తరువాత సంహరించడం ఆయనకి అలవాటు. హిరణ్యాక్షుడి విషయంలోనూ ఆయన ఇదే సూత్రాన్ని పాటించాడు.

భూమి జలప్రళయంలో మునిగిపోయి ఉండటంతో, పరిపాలనా నిర్వహణను ఎలా కొనసాగించాలో తెలియక, బ్రహ్మదేవుడి చెంత ఆయన కుమారుడైన స్వాయంభువ మనువు ఆవేదనను వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని గురించి బ్రహ్మదేవుడు ఆలోచన చేస్తుండగా, ఆయన నాశికలో నుంచి గురగురమని శబ్దం చేస్తూ బొటనవ్రేలు అంతటి 'వరాహ శిశువు' బయటికి వచ్చింది. చూస్తుండగానే ఓ కొండలా పెరిగిపోయిన ఆ వరాహం, అఖండమైనటు వంటి జలాల్లోకి ప్రవేశించింది. అది విష్ణు మాయాజాలమని మనువుతో చెప్పాడు బ్రహ్మ.

జల గర్భంలో మునిగిపోయిన భూమిని తన కోరలతో పైకి తీసుకు రావడానికి విష్ణుమూర్తి ప్రయత్నిస్తుండగా, మహాపరాక్రమవంతుడైన హిరణ్యాక్షుడు అడ్డుపడ్డాడు. శ్రీ మహావిష్ణువు కూడా ఆ సమయం కోసమే ఎదురుచూస్తూ ఉండటంతో, ఇద్దరి మధ్య కొంతకాలం పాటు భీకర యుద్ధం జరిగింది. హిరణ్యాక్షుడి పాపాల చిట్టాకి తగినట్టుగానే వాడిని వరాహావతారంలో స్వామి సంహరించాడు. తన కోర కొమ్ములతో జలగర్భంలోని భూమిని పైకెత్తి, తన గిట్టలతో జలాన్ని అడ్డుకుని అక్కడ భూమిని స్థాపించాడు. అలా వరాహతారంలో ఆయన దుష్ట శిక్షణ చేసి ... లోక కల్యాణానికి కారకుడయ్యాడు.

More Bhakti Articles