పుణ్యఫలాలను అందించే బ్రహ్మోత్సవాలు

తిరుమల బ్రహ్మోత్సవాలు అనేమాట వినగానే ఒక్కసారిగా మనసు అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతుంది. ఆ సమయంలో స్వామివారి సౌందర్యం కళ్లముందు కదలాడుతుంది. ఆహా ..! అనిపించే ఆయన వైభవం మనసు తెరపై అందంగా ఆవిష్కరించబడుతుంది. కొండపై ఆ కోనేటి రాయుడు చేసే సందడిని మళ్లీ ఒక్కసారి చూడాలనిపిస్తుంది.

ఆ స్వామి అలంకరణలో ఒదిగిపోవడానికి ప్రతి పువ్వు ఎంతగా ఆరాటపడుతుందో, ఆ అలంకరణతో చూపులను కట్టిపడేసే ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించాలని ప్రతి మనసు అంతగా తపిస్తుంది. అందుకే వార్షిక బ్రహ్మోత్సవమే అయినా ... నవరాత్రి బ్రహ్మోత్సవమే అయినా ఆయన క్షేత్రానికి లక్షలాదిమంది భక్తులు తరలివస్తూనే వుంటారు.

శ్రీనివాసుడు ఇక్కడ ఆవిర్భవిస్తూ .. లోక కల్యాణం కోసం తనకి ఉత్సవాలు జరిపిస్తూ ఉండాలని బ్రహ్మదేవుడిని ఆదేశించాడట. దాంతో 'శ్రవణా నక్షత్రం'నాటికి పూర్తయ్యేలా తొమ్మిది రోజులపాటు దగ్గరుండి బ్రహ్మదేవుడు ఉత్సవాలను నిర్వహించడం వలన 'బ్రహ్మోత్సవాలు' అనే పేరు వచ్చిందని చెప్పబడుతోంది. 'అంకురార్పణ'తో మొదలయ్యే బ్రహ్మోత్సవాలు ... 'ధ్వజ అవరోహణ'తో ముగుస్తూ ఉంటాయి.

ఈ బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు ముక్కోటి దేవతలు ఈ క్షేత్రంలోనే కొలువుదీరి ఉంటారని చెప్పబడుతోంది. కొన్నివందల సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తోన్న బ్రహ్మోత్సవాలలో ఎంతోమంది రాజులు పాల్గొన్నట్టు చరిత్ర చెబుతోంది. ఈ రోజుల్లో స్వామివారు ఉత్సవమూర్తిగా ... వివిధ రూపాల్లో ... వివిధ వాహనాలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటాడు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారు ఉదయం వేళలోను ... రాత్రి వేళలోను అమ్మవార్లతో కలిసి ఒక్కో వాహనంపై ఒక్కోరూపంలో దర్శనమివ్వడం వెనుక ఒక్కో సందేశం ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో స్వామివారు పెద్దశేష వాహనం .. చిన్నశేషవాహనం .. హంసవాహనం .. సింహవాహనం .. ముత్యపు పందిరివాహనం .. కల్పవృక్ష వాహనం .. సర్వభూపాల వాహనం .. పల్లకీ .. గరుడవాహనం .. హనుమ వాహనం .. గజవాహనం .. సూర్యప్రభ వాహనం .. చంద్రప్రభ వాహనం .. రథోత్సవం .. అశ్వవాహనంపై స్వామి ఊరేగుతాడు. లోక కల్యాణం కోసం స్వామివారికి వైభవంగా జరిపే బ్రహ్మోత్సవాలను ఎవరతే వీక్షిస్తారో వాళ్ల పాపాలు నశించి ఆ పుణ్య ఫలాల ఫలితం కారణంగా సకల శుభాలు చేకూరతయనీ, ఉత్తమగతులు లభిస్తాయని చెప్పబడుతోంది.


More Bhakti News