శ్రీ భ్రమరాంబా దేవి

శ్రీ భ్రమరాంబా దేవి
సతీదేవి 'మెడ భాగం' పడిన శ్రీశైల ప్రదేశంలో 'శ్రీ భ్రమరాంబాదేవి' శక్తి పీఠం ఆవిర్భవించింది. ఇటు శక్తి పీఠాల్లో ఒకటిగా ... అటు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా శ్రీశైలం అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా వెలుగొందుతోంది. ఇక ఇక్కడి అమ్మవారికి భ్రమరాంబ అనే పేరు రావడానికి గల కథ ఒకటి పురాణ కాలం నుంచి వినిపిస్తోంది.

పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి సాక్షాత్కారం కోసం తపస్సు చేసి, దేవతల వలన గానీ ... మానవులవలన గాని ... ఆయుధాల వలన గాని తనకి ప్రాణహాని కలగకుండా వరాన్ని పొందాడు. ఈ వరం కారణంగా అరుణాసురుడు ముల్లోకాలలో అల్లకల్లోలాన్ని సృష్టించడం మొదలుపెట్టాడు.

దాంతో దేవతలంతా కూడా కైలాసం చేరుకొని జగన్మాతను ప్రార్ధించారు. అప్పుడామె భ్రమరములతో సహా ఝంకారమ్ చేస్తూ ప్రత్యక్షమైంది. విషయం తెలుసుకుని భ్రమరముల సైన్యంతోనే అరుణా సురుడిని సంహరించింది. ఈ కారణంగా అమ్మవారు భ్రమరాంబా దేవిగా ఇక్కడ వెలిసి మల్లికార్జున స్వామి సహితంగా నిత్య పూజలు అందుకుంటోంది.

అమ్మవారి మూలవిరాట్టు ఉగ్ర రూపంతో ఉన్నప్పటికీ, అలంకారం వల్ల సౌమ్య మూర్తిగా కనిపిస్తుంది. శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఈ అమ్మవారిని చూస్తూనే 'సౌందర్యలహరి' రచించి ... శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించినట్టు చరిత్ర చెబుతోంది.

More Bhakti Articles