శ్రీ శాంకరీ దేవి

శ్రీ శాంకరీ దేవి
దక్ష ప్రజాపతి ఇష్టానికి వ్యతిరేకంగా ఆయన కూతురు సతీదేవి ... శంకరుడిని వివాహమాడింది. దాంతో శంకరుడిని అవమానపరచాలనే ఉద్దేశంతో, ఆయనను తప్ప మిగతా వారినందరినీ ఆహ్వానిస్తూ దక్షుడు 'బృహస్పతి సవనము' అనే యాగాన్ని తలపెట్టాడు. కైలాస నాధుడైన శివుడికి దక్షుడి ఉద్దేశం అర్ధమైనప్పటికీ మౌనం వహించాడు. తండ్రి ఉద్దేశాన్ని గ్రహించలేకపోయిన సతీదేవి, శివుడి ధోరణినే తప్పుబడుతూ ఒక్కతే అక్కడికి వెళ్లింది. యాగ ప్రాంగణంలో తండ్రి నిజ స్వరూపాన్ని తెలుసుకున్న సతీదేవి, అక్కడే ఆత్మాహుతి చేసుకుంది.

దివ్య దృష్టితో విషయం తెలుసుకున్న పరమశివుడు, తన భార్యను అవమానపరిచిన దక్షుడి తల నరకమంటూ వీరభద్రుడిని ఆదేశించాడు. శివుడి జటాజూటము నుంచి ఆవిర్భవించిన వీరభద్రుడు క్షణాల్లో దక్ష యజ్ఞవాటికను ధ్వంసం చేసి దక్షుడి తల నరికేశాడు. ఆ తరువాత అక్కడికి వచ్చిన శివుడు ... సతీదేవి నిర్జీవ దేహాన్ని తన భుజాన వేసుకుని, ఆ వియోగాన్ని తట్టుకోలేక అడవుల్లో సంచరించడం మొదలు పెట్టాడు.

'లయ' కార్యం సక్రమంగా జరగాలంటే సతీదేవి పై శివుడికిగల వ్యామోహాన్ని తొలగించాలని భావించిన విష్ణుమూర్తి, తన ధనుర్బాణాలతో సతీదేవి నిర్జీవ దేహాన్ని ఖండించాడు. దాంతో ఆమె దేహం 18 ఖండాలై భూలోకంలోని వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. కాలక్రమంలో అవే 'అష్టాదశ శక్తి పీఠాలు' గా అవతరించాయి. అలాంటి శక్తి పీఠాల్లో మొదటిది అయిన 'శ్రీ శాంకరీ దేవి' గురించి తెలుసుకుందాం.

ఈ శక్తి పీఠం శ్రీలంకలోని పశ్చిమ సముద్ర తీరాన 'ట్రిoకోమలి' నగరంలో వెలసింది. ఇక్కడి అమ్మవారు దుష్ట శిక్షణ చేసి ధర్మాన్ని కాపాడుతూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. రావణాసురుడు ప్రతి నిత్యం ఈ అమ్మవారిని పూజించేవాడని తెలుస్తోంది. అయితే ఆయన సీతను అపహరించి తెచ్చినప్పుడు శ్రీ శాంకరీ దేవి ఎంతగా హెచ్చరించినా వినిపించుకోలేదట. దాంతో ఆగ్రహించిన అమ్మవారు అక్కడ అదృశ్యమై కాశ్మీర ప్రాంతానికి తరలివెళ్లింది.

అమ్మవారి ఆగమనం గురించి సంకేతాలు అందడంతో, మహర్షులు అక్కడికి చేరుకొని ఆమెను 'బస శంకరీ' పేరుతో కొలిచారు. అమ్మవారి ఆగ్రహానికి గురైన కారణంగానే రావణాసురుడు పతనమై అంతమయ్యాడని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు.

More Bhakti Articles