వ్యాధులను నివారించే అమృతకుండం

పూర్వజన్మలో చేసుకున్న పాపాలే వ్యాధుల రూపంలో పట్టి పీడిస్తూ ఉంటాయని అంటారు. అలా వివిధరకాల వ్యాధులతో బాధలుపడుతున్నవాళ్లు, ఎన్నో రకాల ఔషధాలు స్వీకరిస్తూ వుంటారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో, ఇక ఈ జీవితం ఇంతే అన్నట్టుగా నిరాశా నిస్పృహలతో కాలం గడుపుతూ వుంటారు. ఫలానా క్షేత్రానికి ఫలానా మహాత్మ్యం ఉందనీ, అక్కడికి వెళ్లడం వలన ఆ వ్యాధి నివారించబడుతుందని ఎవరైనా చెబితే వెంటనే అక్కడికి వెళుతూ వుంటారు.

అలా చర్మసంబంధమైన వ్యాధులు నివారించబడే క్షేత్రంగా 'కేతకీ సంగమేశ్వరస్వామి క్షేత్రం' పేరు వినిపిస్తూ వుంటుంది. ప్రాచీనమైనదిగా ... మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం, జహీరాబాద్ సమీపంలో విలసిల్లుతోంది. ఇక్కడి ' అమృత కుండం' లోని నీరు మహిమాన్వితమైనదనీ ... ఈ నీటిలో స్నానం చేయడం వలన చర్మసంబంధమైన వ్యాధులు నివారించబడతాయని స్థలపురాణం చెబుతోంది.

సూర్య వంశానికి చెందిన ఒక రాజు చర్మసంబంధమైన వ్యాధితో ఎంతగానో బాధపడుతూ ఉండేవాడట. ఒకసారి ఆయన వేటకోసం ఈ ప్రదేశానికి వచ్చి, అలసిపోయిన కారణంగా ఇక్కడి కుండంలోని నీటితో దాహం తీర్చుకుని స్నానం చేశాడట .. అంతే ఆయన చర్మవ్యాధి తగ్గిపోయింది. అప్పటి నుంచి ఈ కుండం అమృతకుండంగా పిలవబడుతోందని చెబుతారు. అష్ట తీర్ధాలకు చెందిన జలధారలు ఈ కుండంలో కలుస్తూ ఉండటం వల్లనే ఈ కుండం ఇంతటి విశిష్టతను సంతరించుకుందని అంటారు.


More Bhakti News