శ్రీవారి కొప్పెర

శ్రీవారి కొప్పెర
ఆగమ శాస్త్రాల్లో హుండీ ప్రస్తావన ఎక్కడా లేకపోయినప్పటికీ, ప్రతి దేవాలయంలోను ఒక హుండీ కనిపిస్తూనే వుంటుంది. ఇక పుణ్యక్షేత్రాలలో భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది కాబట్టి అక్కడ సంఖ్యా పరంగాను ... కొలతల పరంగాను హుండీలు ఎక్కువగానే వుంటాయి. తమ కోరికలు నెరవేర్చిన భగవంతుడి పట్ల కృతజ్ఞతతో భక్తులు హుండీల్లో కానుకలు సమర్పించడమనేది ఒక సంప్రదాయంగా మారిపోయింది. ఇలా హుండీల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా దేవాలయాలు తమ ఆర్ధిక అవసరాలకు ఉపయోగిస్తుంటాయి.

ఇక అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయంగా వున్న తిరుమలలో స్వామివారి హుండీని 'శ్రీవారి కొప్పెర'అని అంటారు. ఇక్కడ హుండీ స్థానంలో కనిపించే గంగాళాన్నేవాడుక భాషలో 'కొప్పెర'అని అంటారు. మూడు అడుగుల గంగాళంలోకి తొమ్మిది అడుగుల కేస్ మెట్ వస్త్రాన్ని వెళ్లాడదీసి హుండీని రూపొందిస్తారు. ఆ కేస్ మెట్ వస్త్రానికి పై భాగంలో నాలుగు వైపులా రంధ్రాలు చేస్తారు. వాటి ద్వారా వేసిన కానుకలు సరాసరి గంగాళంలో పడుతుంటాయి.

గంగాళం నిండి మరో రెండు అడుగుల వరకూ కానుకలు పడగానే వెంటనే హుండీని మార్చేస్తుంటారు. 1980 వరకూ ఇలా రోజుకి రెండు సార్లు మాత్రమే హుండీలు మార్చేవారట. కానీ ఆ తరువాత నుంచి రోజుకి 10 నుంచి 20 వరకూ హుండీలు మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కానుకలతో గంగాళాలు నిండగానే లెక్కింపు కోసం వాటిని 'పరకామణి' కి పంపించేస్తుంటారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని స్వామివారికి లెక్క చెప్పి మరీ ఆయన ఖాతాలో జమచేస్తారు.

More Bhakti Articles