సీత తృణీకరణ

సీత తృణీకరణ
రాముడులేని సమయంలో సీతాదేవిని అపహరించి తీసుకువెళ్లిన రావణాసురుడు, ఆమెను లంకానగరంలోని 'అశోకవనం'లో ఉంచాడు. తనతో వివాహానికి అంగీకరించమంటూ ఒత్తిడి చేశాడు. ఈ విషయమై రావణుడు అశోకవనానికి వచ్చిన ప్రతిసారి సీతాదేవి ఒక 'గడ్డి పరక'ను అడ్డు పెట్టుకుని మాట్లాడేది. పరాక్రమవంతుడైన శ్రీ రాముడు వచ్చి అతణ్ణి సంహరించడం ... తనని తీసుకువెళ్లడం ఖాయమని చెప్పేది.

అయితే రావణుడితో మాట్లాడేటప్పుడు సీతాదేవి గడ్డిపరకను ఎందుకు అడ్డు పెట్టుకునేది అనే సందేహం చాలా మందికి కలుగుతుంటుంది. ఎంతో మంది మహా పండితులు ఈ విషయాన్ని గురించి తమదైన శైలిలో ప్రస్తావించారు. వాటి సారాంశాన్ని పరిశీలిస్తే అందులోని అంతరార్థం అవగతమవుతుంది.

పతివ్రతలు పరపురుషులను నేరుగా చూస్తూ మాట్లాడరు. అంతే కాకుండా వారి ప్రశ్నలకు సమాధానం నేరుగా ఇవ్వకుండా అందుబాటులో గల గడ్డి పోచను తీసుకుని దానితో చెబుతున్నట్టుగా మాట్లాడుతుంటారు. ఇక పతివ్రతల కంటిచూపు సోకిన కారణంగా దుర్మార్గులకు కూడా పుణ్యం ఆపాదించబడే అవకాశం వుంది. ఆ యోగ్యత రావణుడికి లభించకూడదనే ఉద్దేశంతోనే సీతాదేవి గడ్డిపోచను అడ్డుపెట్టుకుని మాట్లాడేదట. అంతే కాకుండా అతని పట్ల తనకి గల 'తృణీకరణ' భావనను ఆమె తృణాన్ని అడ్డు పెట్టుకుని వ్యక్తం చేసేదని పండితుల విశ్లేషణ.

More Bhakti Articles