పశువుల కాపరిగా మారిన నారసింహుడు !

పశువుల కాపరిగా మారిన నారసింహుడు !
భగవంతుడి లీలా విశేషాలు ఆనందాన్నీ ... ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. వివిధ ప్రదేశాల్లో స్వయంభువు మూర్తిగా ఆవిర్భవించడంలోను ఆయన తన లీలా విశేషాలను ప్రదర్శించాడు. అలా ఆయన వెలుగులోకి రావడం కోసం పశువుల కాపరిగా మారిన సందర్భం కూడా లేకపోలేదు. ఆసక్తిని రేకెత్తించే ఈ సంఘటన 'సల్కునూరు'లో కనిపిస్తుంది.

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం పరిధిలో ఈ ఊరు దర్శనమిస్తుంది. ఇక్కడే లక్ష్మీనృసింహస్వామి క్షేత్రం దర్శనమిస్తూ వుంటుంది. దాదాపు అయిదు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఈ ప్రదేశంలో పశువులు మేపడానికి ఒక యువకుడు వెళ్లగా, స్వామివారు మారువేషంలో ఆ యువకుడి దగ్గరికి వెళతాడు.

తాను నృసింహస్వామిననీ ... ఆ ప్రదేశంలో వెలుస్తున్నానని చెబుతాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలిపి, వారిని పూజా ద్రవ్యాలతో అక్కడికి తీసుకురావాల్సిందిగా చెబుతాడు. పశువులను వదిలి వెళ్లడానికి ఆ యువకుడు సందేహిస్తూ ఉండటంతో, అతను తిరిగి వచ్చేంత వరకూ తాను కాపలాకాస్తానని చెబుతాడు. అతను పిలిస్తే తప్ప ఆ పశువులు అడుగు కూడా ముందుకువేయవని చెప్పి, వాటి చుట్టూ ఒక గీత గీస్తాడు.

దాంతో ఆ యువకుడు ఊళ్లోకి వెళ్లి జరిగిన సంఘటన గురించి అందరికీ చెబుతాడు. నమ్మిన వాళ్లు ... నమ్మని వాళ్లు అంతా కూడా నిజానిజాలు తెలుసుకోవడం కోసం అక్కడికి వస్తారు. గీత దాటకుండా మేస్తోన్న పశువులు మాత్రమే అక్కడ కనిపిస్తాయి. ఆ గీత గీసింది దేవుడేనా కాదా అనే విషయం తెలుసు కోవడం కోసం, వచ్చిన వాళ్లు పశువులను అదిలిస్తారు. ఎంతగా ప్రయత్నించినా అవి ఆ గీత దాటి బయటికిరాలేదు. స్వామితో మాట్లాడిన వ్యక్తి పిలవగానే అవి గుంపుగా బయటికి వచ్చేస్తాయి. దాంతో అక్కడి వాళ్ల సందేహం తీరిపోతుంది.

స్వామి ఎక్కడ వెలిసి ఉంటాడా అని వాళ్లు ఆలోచిస్తూ వుండగా, ఒక పెద్ద బండరాయి నుంచి ఓంకారం వినిపిస్తుంది. దగ్గరికి వెళ్లి చూడగా, ఆ రాయిపై శంఖు చక్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆనాటి నుంచి భక్తులు స్వామివారిని తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తూ వస్తున్నారు. కాలక్రమంలో స్వామివారికి ఆలయం నిర్మించబడింది.

ప్రతియేటా ఫాల్గుణ శుద్ధ పంచమి రోజున ఇక్కడ అయిదు రోజుల పాటు జాతర జరుగుతూ వుంటుంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్లు సైతం పెద్ద సంఖ్యలో ఈ జాతరకి తరలివస్తుంటారు. ఆ స్వామికి కానుకలు ... మొక్కుబడులు చెల్లిస్తూ సంతృప్తి చెందుతుంటారు. ఇక్కడి నారసింహుడిని దర్శించుకోవడం వలన, వ్యాధులు ... బాధలు తొలగిపోతాయనీ, ఆశించిన ఫలితాలు లభిస్తాయని భక్తులు విశ్వసుస్తుంటారు.

More Bhakti Articles