ఎవరి పాపం వారిని వెంటాడుతుంది

ఎవరి పాపం వారిని వెంటాడుతుంది
తులసీదాస్ అసమానమైన రామభక్తిని గురించీ ... ఆయన రచనా శైలిని గురించి అంతా గొప్పగా చెప్పుకుంటూ వుంటారు. గతంలో ఆయనతో కలిసి చదువుకున్న రవిదత్తుడుకి ఈ విషయం తీవ్రమైన అసహనాన్ని కలిగిస్తుంది. తన పాండిత్య ప్రతిభను ఎవరూ పట్టించు కోకుండా, తులసీదాస్ కీర్తనలను అంతా మెచ్చుకుంటూ వుండటం ఆయనకి అసూయను కలిగిస్తుంది. దాంతో ఆయన తులసీదాస్ ప్రాణాలకి హాని తలపెట్టాలని నిర్ణయించుకుంటాడు.

ఈ విషయం తెలిసి ఆయన భార్య వారిస్తుంది. తులసీదాస్ మహా భక్తుడనీ, ఆయనకి హాని తలపెట్టాలని చూస్తే భగవంతుడు క్షమించడని చెబుతుంది. అంబరీషుడిని బాధపెట్టినందుకు దూర్వాసుడికి ఎలాంటి పరిస్థితి ఎదురైందో ఒకసారి గుర్తుచేసుకోమని చెబుతుంది. అయినా ఆమె మాటలను ఆయన పట్టించుకోకుండా, ఒక రాత్రివేళ తులసీదాస్ ఆశ్రమానికి నిప్పుపెడతాడు. అయితే శ్రీరాముడి అనుగ్రహం కారణంగా ఆ మంటలు చల్లారిపోతాయి.

ఆ క్షణమే రవిదత్తుడికి శరీరమంతటా మంట పుట్టడం మొదలవుతుంది. ఆ మంటను తట్టుకోలేక ఆయన నానాఅవస్థలు పడసాగాడు. ఆ మంటల నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలియక పరుగులు తీయసాగాడు. చేసిన పాపం ఆయనని ఆ విధంగా వెంటాడుతోందని గ్రహించిన భార్య, తన భర్తను మన్నించమంటూ శ్రీరాముడిని వేడుకుంటుంది. మరోమారు ఆయన అలాంటి పాపాలు చేయకుండా తాను చూసుకుంటానని ప్రాధేయపడుతుంది. తులసీదాస్ పట్ల ఆమెకి గల అభిమానం కారణంగా ఆమె అభ్యర్థనను శ్రీరాముడు మన్నిస్తాడు. తన తప్పును తెలుసుకున్న రవిదత్తుడు క్షమించమంటూ తులసీ దాస్ పాదాలపై పడతాడు.

More Bhakti Articles