రామనామం

రామనామం
'రామ నామం' మధురమైనదే కాదు ... మహిమాన్వితమైనది కూడా. రామ నామం ఎంత గొప్పదనే విషయాన్ని తన హృదయాన్ని చీల్చి మరీ రాముడికి హనుమంతుడు చూపించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఇక రామనామం ఎంతటి మహిమాన్వితమైనదనే విషయాన్ని చాటి చెప్పే కథ కూడా ప్రచారంలో వుంది.

రావణాసురుడిని సంహరించిన అనంతరం ఆయన సోదరుడైన విభీషణుడికి ఆ రాజ్యాన్ని అప్పగించి సీతా సమేతంగా శ్రీరాముడు అయోధ్యకి వెళ్లిపోయాడు. కాలక్రమంలో విభీషణుడు తన సేవకుడితో రాముడికి ఓ సందేశాన్ని పంపించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా సందేశ పత్రాన్ని సిద్ధం చేసి దానిని తన సేవకుడికి అందించాడు.

అయోధ్యకి వెళ్లి ఆ సందేశ పత్రాన్ని ఇవ్వడానికి తాను సిద్దంగానే ఉన్నాననీ, అయితే సముద్రం దాటడం మాత్రం తన వల్ల కాదంటూ ఆ సేవకుడు తన అసమర్ధతను వ్యక్తం చేశాడు. దాంతో మరో పత్రం పై విభీషణుడు ఏదో రాసి ఆ సేవకుడి చేతిలో పెట్టాడు. అత్యంత శక్తి వంతమైన మంత్రాన్ని తాను ఆ పత్రంలో రాశాననీ, తిరిగి వచ్చేంత వరకూ దానిని చదవడానికి ప్రయత్నించవద్దని చెప్పాడు.

రెట్టించిన ఉత్సాహంతో సముద్ర తీరానికి వెళ్ళిన ఆ సేవకుడు అవలీలగా గాలిలోకి ఎగిరి సముద్రం పై ప్రయాణం చేస్తున్నాడు. అనుకోకుండా వచ్చిన ఈ శక్తి అతనికే ఆశ్చర్యాన్ని కలిగించింది. దాంతో ఆ పత్రంలో విభీషణుడు రాసిన మంత్ర మేమిటో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. సముద్రం పై ప్రయాణిస్తూనే మంత్రం రాయబడిన పత్రాన్ని తెరిచి చూశాడు.

ఆ పత్రంలో 'శ్రీ రామ'అని మాత్రమే వుండటం చూసి ఆ సేవకుడు ఆశ్చర్య పోయాడు. ఏదో శక్తిమంతమైన మంత్రమని చెప్పి విభీషణుడు రాసింది ఇదేనా! అని అనుకున్నాడు. అంతే గాల్లో ఎగురుతున్న వాడల్లా ఒక్కసారిగా సముద్రంలో కుప్పకూలిపోయాడు. రామనామం ఎంతటి మహిమాన్వితమైనదనడానికి ... దానిని ఎంత విశ్వాసంతో జపిస్తే అంతటి ఫలితం ఉంటుందనడానికి నిదర్శనంగా ఇప్పటికీ ఈ కథను చెప్పుకుంటూ వుంటారు.

More Bhakti Articles