అప్పన్న గురించి ఆకాశవాణి అలా పలికిందట !

అప్పన్న గురించి ఆకాశవాణి అలా పలికిందట !
సింహాచలం అనే పేరు వినగానే అక్కడ ఆవిర్భవించిన వరాహ లక్ష్మీనరసింహ స్వామి రూపం గుర్తుకొస్తుంది. అత్యంత వైభవంగా ఆయనకి జరిపే చందనోత్సవం కనులముందు కదలాడుతుంది. హాలాహలాన్ని మింగిన శివుడు ఆ తాపాన్ని తట్టుకోవడానికి అనునిత్యం అభిషేకాన్ని కోరుకున్నట్టుగా, హిరణ్యకశిపుడిని సంహరించిన నృసింహస్వామి ఉగ్రత్వాన్ని చల్లబరచుకుని తిరిగి శాంతాన్ని పొందడానికి చందనోత్సవాన్ని కోరుకున్నట్టుగా అనిపిస్తుంది.

పన్నెండు మణుగుల చందనం పూయబడి లింగాకారంలో కనిపించే స్వామి, ఏడాదికి ఒకసారి మాత్రమే నిజరూప దర్శనం ఇస్తుంటాడు. స్వామివారి నిజరూప దర్శనం ఇలా ఏడాదికి ఒకసారి మాత్రమే లభిస్తుందని సాక్షాత్తు ఆకాశవాణియే పురూరవ చక్రవర్తితో చెప్పినట్టుగా పురాణ కథనం.

పూర్వం ఊర్వశితో కలిసి పురూరవ చక్రవర్తి ఈ ప్రాంతంలో విహరిస్తూ ఇక్కడ విశ్రాంతి తీసుకోగా, స్వప్న దర్శనమిచ్చిన స్వామి తన జాడను తెలియజేస్తాడు. తనని పన్నెండు మణుగుల చందనంతో పూజించమని చెబుతాడు. స్వామివారు చెప్పినట్టుగానే ఆయనకి చందనోత్సవాన్ని నిర్వహించిన పురూరవుడు, ఆ వెంటనే ఆయన నిజరూపాన్ని చూడటానికి ప్రయత్నిస్తాడు. ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో తన వలన ఏదైనా అపరాధం జరిగిందేమోనని ఆందోళన చెందుతాడు.

ఆ సమయంలోనే ఆయనని ఉద్దేశించి ఆకాశవాణి పలుకుతుంది. స్వామివారి నిజరూప దర్శనం వెంటనే లభించదనీ, ప్రతి సంవత్సరం 'వైశాఖ శుద్ధ తదియ' రోజున మాత్రమే ఆయన నిజరూప దర్శనం లభిస్తుందని చెబుతుంది. అప్పటి వరకూ చందనం పూయబడిన స్వామి రూపాన్నే ఆరాధించాలని అంటుంది. ఈ నియమాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే లోకంలో అరిష్టాలు సంభవిస్తాయని హెచ్చరిస్తుంది. దాంతో ఆకాశవాణి ఆదేశించిన విధంగా పూజాది కార్యక్రమాలు జరిగేలా పురూరవుడు తగిన చర్యలు తీసుకుంటాడు. ఆనాటి నుంచి అదే విధానాన్ని అనుసరిస్తూ ... ఆచరిస్తూ ఉండటం జరుగుతోంది.

More Bhakti Articles