మారువేషంలో వచ్చింది మహాదేవుడే !

మారువేషంలో వచ్చింది మహాదేవుడే !
విశ్వామిత్రుడికి రాజ్యాన్ని అప్పగించి ఆయన శిష్యుడైన నక్షత్రకుడు వెంటరాగా, భార్యా బిడ్డలతో కలిసి హరిశ్చంద్రుడు అక్కడి నుంచి బయలుదేరుతాడు. అంతా కలిసి కొన్ని రోజుల పాటు ప్రయాణించి 'కాశీ' నగరానికి చేరుకుంటారు. తన సొమ్ము చెల్లించమంటూ విశ్వామిత్రుడు విధించిన గడువు ఆ రోజుతో ముగియనున్నట్టు హరిశ్చంద్రుడికి నక్షత్రకుడు గుర్తుచేస్తాడు. సూర్యాస్తమయంలోగా అంత సొమ్మును ఎలా సంపాదించాలో తెలియక హరిశ్చంద్రుడు ఆలోచనలోపడతాడు.

దాసీలను కొనుగోలు చేసే ఆచారం అక్కడ ఉండటం గమనించిన చంద్రమతి, తనని అమ్మకానికి పెట్టి సత్య వ్రతాన్ని కాపాడవలసిందిగా భర్తను కోరుతుంది. విధిలేని పరిస్థితుల్లో అందుకు ఆయన అంగీకరిస్తాడు. ఆమెను కొనుగోలు చేయడం వలన భర్త నుంచి వేరుచేసిన పాపం తమకి తగులుతుందని భావించిన కాశీ నగర ప్రజలెవరూ అందుకు ముందుకురారు.

సూర్యాస్తమయం సమీపిస్తూ ఉండటంతో చంద్రమతి కంగారుపడుతుంది. ఎవరైనా సరే దాసీగా తనని కొనుగోలు చేసేలా చూసి, తన భర్త మాటను నిలబెట్టవలసిందిగా కాశీ విశ్వేశ్వరుడిని ప్రార్ధిస్తుంది. దాంతో ఆ నగరంలో శ్రీమంతుడైనటు వంటి 'కాలకౌశికుడు' రూపంలో శివుడు అక్కడికి వస్తాడు. హరిశ్చంద్రుడు అడిగినంత సొమ్మును ఇచ్చి, చంద్రమతిని తాను కొనుగోలు చేస్తున్నట్టుగా చెబుతాడు. ఆనందంతో చంద్రమతి ఆ దేవదేవుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలియజేస్తుంది.

చంద్రమతి ... ఆమె కుమారుడు లోహితాస్యుడు కొంతకాలం పాటు కాలకౌశికుడి ఇంట్లో ఉండటం మంచిదని మారువేషంలో గల శివుడు భావిస్తాడు. కాలకౌశికుడి వేషంలోనే కాలకౌశికుడి ఇంటికి చేర్చి అక్కడ అదృశ్యమవుతాడు. అలా ఆయన తన భక్తుడైనటువంటి హరిశ్చంద్రుడి మాటను నిలబెట్టడం కోసం, పరమ పతివ్రత అయిన చంద్రమతి మనసు కుదుటపడేలా చేయడం కోసం మారువేషంలో రావడం జరిగింది. మహాదేవుడి లీలలు తెలుసుకోవడం ఎవరి తరమూ కాదని నిరూపించడం జరిగింది.

More Bhakti Articles