వరాలనిచ్చే వల్లభరాయుడు

వరాలనిచ్చే వల్లభరాయుడు
వల్లభరాయుడంటే సాక్షాత్తు శ్రీమహావిష్ణువే. భక్తులను ఆదరించడంలోను ... ఆపదల నుంచి ఆదుకోవడంలోను వల్లభరాయుడు క్షణకాలమైనా ఆలస్యం చేయడు. అందుకు నిదర్శనంగానే 'గజేంద్ర మోక్షం' ఘట్టం చెప్పబడుతోంది. ఆర్తితో స్వామిని పిలవడానికి భక్తుడు ఆలస్యం చేయాలేగానీ, ఆపదలో వున్న భ్యక్తుడిని రక్షించడానికి స్వామి ఉన్నపళంగా వచ్చేస్తుంటాడు.

అలా మొసలి బారి నుంచి ఏనుగును కాపాడిన అనంతరం స్వామి అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. అలాంటి క్షేత్రాల్లో ఒకటిగా గుంటూరు జిల్లాకి చెందిన 'వంగీపురం' కనిపిస్తుంది. గజేంద్రుడిని కాపాడటానికి వచ్చిన వల్లభుడు, సదా తమని రక్షిస్తూ ఉండటం కోసమే ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నాడని స్థానికులు భావిస్తుంటారు.

ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ ఆలయం, అడుగుపెట్టడంతోనే మానసిక ప్రశాంతతను అందిస్తుంది ... ఆధ్యాత్మిక భావాలను వికసింప జేస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయాన్ని చూడగానే, ఇది చాలా ప్రాచీనమైనదని తెలిసిపోతూ వుంటుంది. హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ ఆలయంలో అడుగుపెట్టగానే, ఇది దేవతలు ... మహర్షులు నడయాడిన పుణ్యస్థలి అనే విషయం అర్థమైపోతుంది.

గర్భాలయంలో స్వామివారు శంఖు చక్రాలను ... గదను ధరించి అభయ హస్తంతో దర్శనమిస్తూ వుంటాడు. గర్భాలయం పక్కనే గల ప్రత్యేక మందిరంలో అమ్మవారు రాజ్యలక్ష్మీదేవి పేరుతో పూజలు అందుకుంటూ వుంటుంది. అడిగినదే తడవుగా ఇక్కడి స్వామివారు కోరిన వరాలను ప్రసాదిస్తూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో కుటుంబ సమేతంగా ఈ స్వామిని సేవిస్తూ తరిస్తుంటారు.

More Bhakti Articles