అలా భూమిలో నుంచి గంగ పొంగింది !

ఆశ్రమవాసిగా వున్న జయదేవుడికి అనుకోకుండా పద్మావతీదేవితో పరిచయం ఏర్పడుతుంది. గురువు ఆదేశం మేరకు ఆమెను వివాహమాడిన జయదేవుడు, తన స్నేహితుడైన పరాశరుడి ఇంట్లో కొత్తకాపురం పెడతాడు. సామాజిక పరమైన కట్టుబాట్లకు విరుద్ధంగా వారి వివాహం జరిగిందనే ప్రచారం ఆ ఊళ్లో జరుగుతుంది. దాంతో జయదేవుడు .. పద్మావతీలతో పాటు వాళ్లకి ఆశ్రయం ఇచ్చిన పరాశరుడిని కూడా ఊళ్లో వాళ్లు వెలివేస్తారు.
దాంతో వాళ్లకి ఆ ఊళ్లో మంచినీళ్లు దొరకడం కూడా కష్టమైపోతుంది. ఇంట్లో వున్న వంట పదార్థాలు ... మంచినీళ్లు అయిపోవడంతో వాళ్లకి రోజులు కష్టంగా గడుస్తుంటాయి. కృష్ణుడికి అభిషేకం కూడా చేయలేని పరిస్థితిల్లో ఉన్నందుకు జయదేవుడు బాధపడతాడు. తన ఆకలి తీరని ప్రదేశంలోనైనా తాను వుంటాను గానీ, తన కృష్ణయ్యకు అభిషేకం జరగని చోటున తాను వుండలేనంటూ ఆ ఊరు వదిలిపోవడానికి జయదేవుడు సిద్ధపడతాడు.
భర్త అభిప్రాయాన్ని అంగీకరిస్తూ పద్మావతీదేవి కూడా అక్కడి నుంచి బయలుదేరుతుంది. తన ఇంటి నుంచి జయదేవుడు వెళ్లిపోవడానికి నిర్ణయించుకోవడం పరాశరుడికి బాధ కలిగిస్తుంది. తన స్నేహితుడి భక్తి నిజమైనదే అయితే ఆయనకి కావలసిన అభిషేక జలాన్ని ఇవ్వమంటూ కృష్ణుడిని ప్రార్ధిస్తాడు పరాశరుడు. అలా ప్రార్దిస్తూనే తన ఇంటి ప్రాంగణంలో గడ్డ పలుగుతో బావిని తీయడానికి సిద్ధపడతాడు.
అలా ఆయన రెండుమార్లు గడ్డ పలుగుని భూమిలోకి దింపాడో లేదో ఒక్కసారిగా గంగ పైకి పొంగుకొస్తుంది. పద్మావతీ ... పరాశరుడు ఆనందంతో ఆ నీటిని కడవలలోకి నింపుతూ వుంటారు. కృష్ణుడు అనుగ్రహించాడు ... తన అభిషేకానికి కావలసిన నీటిని తానే సమకూర్చుకున్నాడని జయదేవుడు సంతోషంతో పొంగిపోతాడు. స్వచ్ఛమైన ఆ నీటితో శ్రీకృష్ణుడికి తనివితీరా అభిషేకం చేస్తూ పులకించిపోతాడు. ఈ దృశ్యం చూసిన ఊళ్లో వాళ్లకి జయదేవుడు ఎంతటి మహాభక్తుడనే విషయం బోధపడుతుంది. అంతటి మహానుభావుడిని దూరంపెట్టి పాపం చేశామనే పరివర్తన కలుగుతుంది.