శివలీల

ప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రాలలో 'వాడపల్లి'క్షేత్రం ఒకటి. కృష్ణా నదీ తీరంలో వెలసిన ఈ క్షేత్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో అలరారుతోంది. ఇక్కడి గర్భాలయంలోని శివలింగం 'అగస్త్య మహర్షి' ప్రతిష్ఠితమని తెలుస్తోంది. పురాణాల్లో శివపురమనే పేరుమీద ఈ క్షేత్ర ప్రాశస్త్యం చెప్పడం జరిగింది.

ఇక్కడి శివలింగంపై లోతుగా పగులు కనిపిస్తూ వుంటుంది. ఈ పగులులో నుంచి నీరు పైకి ఉబికి వస్తూ వుంటుంది. దీని గురించి స్థానికంగా ఎన్నో కథలు ప్రచారంలో వున్నాయి. అయితే జగద్గురు శంకరాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు, శివలింగం పగులు ఎంత వరకూ ఉన్నదనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించారు.

ఆయన ఒక ఉద్ధరిణికి దారం కట్టి దానిని ఆ పగులులోకి వదిలారు. అలా ఎంత దారం వదిలినా అది లోపలికి వెళుతూనే ఉండటంతో, ఇక ఆ దారాన్ని వెనక్కి చుట్టడం మొదలు పెట్టారు. తెల్లని ఆ దారం చివరన రక్తం అంటుకుని వుండటం ... ఆ ఉద్ధరిణిలో నీరు కూడా ఎరుపు రంగులో వుండటం చూసి ఆయనకి విషయం అర్థమైంది. అంతే స్వామివారికి తన పశ్చాత్తాపాన్ని తెలియజేసి అభిషేకాలు నిర్వహించినట్టు స్థలపురాణం చెబుతోంది. మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రాన్ని దర్శించడానికి విశేష సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.


More Bhakti News