రాగంతో దీపాన్ని వెలిగించవచ్చా ?

రాగంతో దీపాన్ని వెలిగించవచ్చా ?
త్యాగరాజస్వామి జీవితాన్ని పరిశీలిస్తే వేల కీర్తనలతో ఆయన ఆ శ్రీరామచంద్రుడిని అభిషేకించిన తీరు కనిపిస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన ఆ రాముడి పాదాలను విడవకపోవడం కనిపిస్తుంది. అలాగే తాను పెట్టిన ప్రతి పరీక్షలో నెగ్గుతూ వెళుతోన్న త్యాగరాజుని శ్రీరాముడు అనుగ్రహిస్తూ వచ్చిన వైనం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

అందుకే త్యాగరాజు కీర్తనలు మనసుకు ఎంతగా హత్తుకుపోతాయో, ఆయన అసమానమైన భక్తి కారణంగా ఆవిష్కరించబడిన కొన్ని సంఘటనలు, అంతగా ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఈ నేపథ్యంలో 'పుదుక్కోట' లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకోవచ్చు. ఒకసారి ... పుదుక్కోట సంస్థానాదీశుడైన విజయరఘునాథుడుని కలుసుకోవడానికి, ఆయన ఆస్థానానికి వెళతాడు త్యాగరాజు. ఆ సమయంలో అక్కడ ఎంతోమంది సంగీత విద్వాంసులు వుంటారు.

విజయరఘునాథుడితో పాటు వాళ్లంతా కూడా త్యాగరాజుకి ఆహ్వానం పలుకుతారు. అంతా ఆశీనులైన తరువాత అక్కడి వేదికపై గల ప్రమిదను చూపిస్తాడు విజయరఘునాథుడు. ఎవరైనా తమ గానామృతంతో అక్కడి ప్రమిదలోని వత్తిని వెలిగించవలసిందిగా కోరతాడు. అసాధారణమైన ప్రతిభాపాటవాలతో పాటు, అసమానమైన భక్తి విశ్వాసాలు కూడా అందుకు అవసరమని భావించిన వాళ్లంతా మౌనం వహిస్తారు.

అప్పుడు త్యాగరాజు 'జ్యోతిస్స్వరూపిణి' రాగాన్ని ఆలపిస్తాడు. విజయరఘునాథుడితో పాటు అక్కడున్న వాళ్లంతా కూడా ఆ మాధుర్యానికి పరవశించి పోతుంటారు. ఆ సమయంలోనే ప్రమిదలోను వత్తి దానంతట అది వెలుగుతుంది. అద్భుతమైన ఈ దృశ్యాన్ని చూసిన వాళ్లంతా ఆశ్చర్య పోతారు. త్యాగరాజు సంగీత సామర్ధ్యానికీ ... ఆయన భక్తి విశ్వాసాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించడం తాము చేసుకున్న అదృష్టంగా భావిస్తారు.

More Bhakti Articles