శ్రీ శంఖం

ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉత్తమ లక్షణాలు కలిగిన శ్రీ శంఖానికి విశిష్టమైన స్థానముంది. శంఖాన్ని లక్ష్మీ స్వరూపంగా ... మహిమాన్వితమైనదిగా భావిస్తుంటారు. ఈ కారణంగానే సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడు చక్రంతో పాటుగా శంఖాన్ని కూడా ధరిస్తాడు. ఇక శంఖంలో పోస్తేనేగాని తీర్థం కాదనే మాటను మనం వింటూ ఉండటమే కాదు, దేవుడికి శంఖంలో పోసిన నీటితోనే అభిషేకాలు చేస్తుండటం కూడా చూస్తుంటాం.

ఇక శంఖం పేరు చెప్పగానే మహాభారత యుద్ధ సమయంలో శ్రీ కృష్ణుడు శంఖానాదం చేసినట్టుగా చదివిన విషయాలే మన కళ్ల ముందు కదలాడతాయి. భూమి ... ఆకాశం ... బంగారం సమ్మిళతమే శంఖమని 'అధర్వణ వేదం' చెబుతోంది. పూర్వం శంఖానాదాన్ని శుభ సూచకంగా భావించేవారు. సూర్యోదయానికి ముందు ... సూర్యాస్తమయం తరువాత మాత్రమే శంఖాన్ని ఊదేవారు.

సముద్రంలో నివసించే ఓ జీవి తన ఆత్మరక్షణ కోసం తయారు చేసుకున్న కవచమే కాలక్రమంలో మనకి శంఖంలా లభిస్తోంది. ఇది సున్నపు గుణాలతో తయారు కావడం వలన, ఇందులో తీర్థం స్వీకరించడం వలన వాత పిత్త దోషాలు తొలగిపోతాయి. శంఖానాదం శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించడమే కాకుండా, దుష్ట శక్తులను నియంత్రిస్తుంది. ఆ శబ్దం ఎంత దూరం వెళితే అంత వరకూ సూక్ష్మ క్రిములు నశిస్తాయని నిరూపణ చేయబడింది. శంఖానాదం సుదీర్ఘమైనటు వంటి వ్యాధుల బారి నుంచి బయటపడేసి, ఆరోగ్యాన్ని ... ఆయుష్షును ఇవ్వడంలోనూ ప్రధాన పాత్రను పోషిస్తుంది.


More Bhakti News