ఆశ్చర్యచకితులను చేసే అరుదైన ఆలయం

లోక కల్యాణం కోసం శ్రీమన్నారాయణుడు వివిధ అవతారాలను ధరించాడు. దుష్టులను శిక్షిస్తూ ... శిష్టులను రక్షిస్తూ వచ్చాడు. ఇక 'వామనావతారం' విషయానికి వచ్చేసరికి స్వామివారికి ఒక చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ప్రహ్లాదుడి మునిమనవడైన 'బలిచక్రవర్తి' కూడా శ్రీమహావిష్ణువుకి పరమభక్తుడు. అనునిత్యం విష్ణుమూర్తిని సేవించే ఆయన, దేవలోకంపై దండెత్తి ఇంద్రుడిని ఓడించి ఆ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు.

ఈ విషయంలో ఇటు ఇంద్రుడికీ ... అటు బలిచక్రవర్తికి న్యాయం చేయదలచుకున్న విష్ణుమూర్తి, 'అదితి' గర్భాన వామనుడిగా అవతరిస్తాడు. బాల వటువుగా బలిచక్రవర్తిని కలిసి మూడు అడుగుల నేలను దానంగా అడుగుతాడు. వచ్చినది శ్రీమహావిష్ణువని గ్రహించిన బలిచక్రవర్తి అందుకు అంగీకరిస్తాడు.

దాంతో శ్రీమహావిష్ణువు ఒక అడుగుతో ఆకాశాన్ని ... మరో అడుగుతో భూమిని ఆక్రమించి, మూడో అడుగు ఎక్కడ పెట్టాలని అడుగుతాడు. మూడో అడుగుగా పవిత్రమైన ఆ పాదాన్ని తన తలపై మోపమని అంటాడు బలిచక్రవర్తి. 'సావర్ణి మన్వంతరం'లో ఆయనకి ఇంద్ర పదవి లభిస్తుందనీ, అంతవరకూ సుతలాన్ని పాలించమంటూ స్వామి ఆయన తలపై పాదాన్ని మోపి పాతాళానికి అణచివేస్తాడు.

ఇలా వామనావతారాన్ని ధరించిన శ్రీమహావిష్ణువు ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిలో ఒకటిగా తమిళనాడు - కాంచీపురంలోని 'ఉలగళంద పెరుమాళ్' క్షేత్రం దర్శనమిస్తుంది. అటు పురాణ నేపథ్యాన్ని... ఇటు చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఈ ఆలయాన్ని చూసితీరవలసిందే. రెండు అడుగుల్లో భూమి .. ఆకాశాలను ఆక్రమించిన శ్రీ మహావిష్ణువు, మూడో అడుగు ఎక్కడ పెట్టాలని అడుగుతున్నట్టుగా గర్భాలయంలోని మూర్తి దర్శనమిస్తూ వుంటుంది.

స్వామివారి మూర్తి సున్నం మిశ్రమంతో తయారుచేయబడిందనీ, అందువలన ఇక్కడ అభిషేకాలు చేయడం ఉండదని చెబుతుంటారు. స్వామివారు 'ఉలగళంద పెరుమాళ్' పేరుతోను, అమ్మవారు 'అమృతవల్లి' పేరుతోను భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. అత్యంత విశిష్టమైనదిగా ... విశేషమైనదిగా చెప్పబడుతోన్న ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వామనావతారంలో గల స్వామివారిని దర్శించి ధన్యులవుతుంటారు.


More Bhakti News