విభూతి

విభూతి
శివారాధకులు ... సన్యాసులు 'విభూతి' ధారణ చేస్తుంటారు. హోమగుండము నందు రావి ... మోదుగ మొదలైన సమిధలచే హోమము చేయడం వలన, గోమయంచే చేయబడిన పిడకలు కాల్చడం వలన వచ్చిన భస్మాన్ని 'విభూతి'అని అంటారు. ఏ వస్తువైనా దహించడం వలన భస్మం వస్తుంది గానీ, భస్మానికి దహింపబడే గుణం లేదు. కాబట్టి ఇది నిర్గుణమై ... నిరాకారుడైన శివుడికి ప్రీతీ పాత్రమైనది. ఇది తెలుపు రంగులో ఉండి పవిత్రతకు ... నిర్మలత్వానికి ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది.

విభూతి మహిమాన్వితమైనదనీ ... దీనిని ధరించడం వలన ఆరోగ్యం ... ఐశ్వర్యం ... మోక్షం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. విభూతిని ధరించడం వలన రక్త సంబంధమైన దోషములు తొలగిపోతాయి. శరీరమునకు అవసరమైన వేడిని తగిన మోతాదులో ఉంచుతూ చర్మ సంబంధమైన వ్యాధులు రాకుండా ఇది కాపాడుతుంది. శరీరం లోపల వుండే వివిధ అంగముల పనితీరుపై విభూతి మంచి ప్రభావం చూపుతుంది. శాంత స్వభావాన్ని కలిగించడమే కాకుండా, చలిని తట్టుకునే శక్తిని ఇది ప్రసాదిస్తుందని ఆయుర్వేద గ్రంధాలు చెబుతున్నాయి.

బ్రాహ్మణులు అడ్డబొట్టు (త్రిపుండ్రం)గా విభూతిని ధరిస్తారు. వీరు కుడిచేతి మధ్య ... అనామిక వేళ్లతో ఎడమవైపు నుంచి కుడివైపుకు నుదుటన భస్మ రేఖను దిద్దుకుని, బొటనవ్రేలుతో కుడివైపు నుంచి ఎడమవైపుకు మధ్య రేఖను దిద్దుకుంటారు. గృహస్తులు విభూతిని నీటితో తడిపి ధరించవలసి ఉంటుంది. ఇక స్త్రీలు ... సన్యాసులు పొడిగా విభూతిని దిద్దుకోవాలని శాస్త్రం చెబుతోంది.

విభూతి ఎంతో మహిమాన్వితమైనది కాబట్టే, పంచ స్నానాలలో భస్మ స్నానానికి గల ప్రాధాన్యతను పురాణాలు వివరించాయి. ఇక శిరిడీ సాయిబాబా కూడా తన దగ్గరికి వచ్చిన వారికి సర్వరోగ నివారిణిగా విభూతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. శివుడు ఐశ్వర్య కారకుడు కావడంతో, ఆయన ధరించిన కారణంగా విభూతికి 'ఐశ్వర్యం' అనే అర్ధం వాడబడుతోంది. ఇక ఎన్నో పాపాలు చేసిన వారు సైతం మరణ కాలంలో విభూతిని ధరించినట్టైతే, అలాంటి వాళ్లు శివ సాయుజ్యాన్ని పొందుతారనడానికి నిదర్శనంగా పురాణాల్లో మనకి ఎన్నో కథలు కనిపిస్తాయి. అందుకే మహిమాన్వితమైన విభూతి తరతరాలుగా తన ప్రత్యేకతను ... పవిత్రతను కాపాడుకుంటూనే వస్తోంది.

More Bhakti Articles