అదే గన్నేరు పువ్వు ప్రత్యేకత !

 అదే గన్నేరు పువ్వు ప్రత్యేకత !
పూజలో పూలు ఒక భాగమని భక్తులు భావిస్తుంటారు. అందుకే పూజ అనగానే పూలతో సిద్ధమై పోతుంటారు. వివిధ రకాల పూలతో భగవంతుడిని అర్చించినప్పుడు ... పూమాలలతో దైవాన్ని అలంకరించినప్పుడు కలిగే ఆనందం ... అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఇంట్లోని పూజా మందిరంలో గల దైవాన్ని పూజించడానికి, ఎవరికి వాళ్లు వివిధ రకాల పూల మొక్కలను పెంచుతూ వుంటారు.

ఇక అందుకు అవకాశం లేనివాళ్లు వీలును బట్టి పూలను కొంటూవుంటారు. ఒక్కో రకం పూలను పూజకి ఉపయోగించడం వలన ఒక్కో విశేషం కలిగిన ఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. తోటలోవే అయినా ... కొన్నవే అయినా తాజా పూలను మాత్రమే భగవంతుడికి సమర్పించాలని స్పష్టం చేస్తోంది.

ఇక ఎంతటి మేలుజాతి పూలైనా ... కొద్దిగానే వాడిపోయినా మరునాడు ఉదయాన్నే ఆ నిర్మాల్యాలను తీసివేయాలి. లేదంటే నిర్మాల్య దోషం కలుగుతుందని అంటారు. ఇలా నిర్మాల్య దోషం లేని పూలు ఏమైనా ఉన్నాయా అంటే అవి ఒక్క గన్నేరు మాత్రమేనని చెప్పుకోవాలి. గన్నేరు జాతికి చెందిన పూలు అందంగా ... ఆకర్షణీయంగానే కాదు, ఎంతో పవిత్రతను సంతరించుకుని కనిపిస్తూ వుంటాయి. ఈ పువ్వును చూడగానే భగవంతుడి సన్నిధిలో వీటికి ఒక ప్రత్యేక స్థానం ఉందనే విషయం అర్థమైపోతూ వుంటుంది.

అలాంటి గన్నేరు పూలను ఒకసారి పూజకి ఉపయోగించిన తరువాత, మరునాడు ఉదయమే తీసివేయక పోవడం వలన దోషం వుండదు. ఒకసారి వాటిపై నీటిని చిలకరించి, తిరిగి వాటిని భగవంతుడి సేవకు ఉపయోగించ వచ్చని చెప్పబడుతోంది. భగవంతుడి సేవకు గాను నిర్మాల్య దోషం లేనివిగా ఉపయోగించబడుతూ ఉండటమే గన్నేరు పూల ప్రత్యేకతగా ... విశిష్టతగా చెప్పుకోవచ్చు.

More Bhakti Articles