గంధంతో చేసిన శివలింగాన్ని పూజిస్తే ఫలితం ?

గంధంతో చేసిన శివలింగాన్ని పూజిస్తే ఫలితం ?
మహాశివుడు మంచుకొండల్లో కన్నా భక్తుల మనసులో ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతూ వుంటాడు. గోరంత సేవలను అందుకుని .. కొండంత కోరికలను తీర్చడమే ఆనందంగా భావిస్తూ వుంటాడు. అందువలన సదాశివుడికి సంతోషాన్ని కలిగించడం కోసం భక్తులంతా ఆరాటపడుతుంటారు. తమ పూజా మందిరంలోనే శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని అనుదినం ఆయనని అర్చిస్తూ వుంటారు.

సోమవారం రోజున మాత్రమే ఆలయానికి వెళ్లి ఆదిదేవుడిని సేవించేవాళ్లు కొందరు వుంటే, మరికొందరు పర్వదినాల్లో మాత్రమే ఆయన దర్శన భాగ్యాన్ని పొందుతూ వుంటారు. ఈ నేపథ్యంలో ఆలయాలలోనైనా ... పూజా మందిరాలలోనైనా శిలా రూపంలో గల శివలింగాలే దర్శనమిస్తూ వుంటాయి. ఈ శివలింగాలను అభిషేకించడం వలన విశేషమైన పుణ్యఫలితాలు లభిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే మట్టితో ... ఆవు పేడతో ... బెల్లంతో ... పటికతో ... విభూతితో ... స్పటికతో ... వెన్నతో ... గంధంతో చేయబడిన శివలింగాలలో ఒక్కో రకమైన శివలింగాన్ని పూజించడం వలన ఒక్కో ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ జాబితాలో 'గంధపు శివలింగం' మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. గంధంతో చేసిన శివలింగాన్ని పూజించడం వలన, సమస్త పాపాలు నశించి ... సకల దోషాలు నివారించబడతాయని చెప్పబడుతోంది.

నిజానికి గంధంతో శివలింగాన్ని తయారు చేసుకోవడం ఎంతో తేలికతో కూడుకున్న పని. జీవితంలో తెలిసీ తెలియక మూటగట్టుకున్న పాపాలను వదిలించుకోవడం అంత ఆషామాషీ విషయమేం కాదు. అలాంటిది జీవితాన్ని అతలాకుతలం చేసే పాపాల నుంచి విముక్తిని పొందడానికి శివుడు ఇంత తేలికైన మార్గాన్ని సూచించాడు. అందువల్లనే మహాశివుడి మనసు మంచులాంటిదని అంతా అంటూ వుంటారు ... అనునిత్యం ఆయన ఆరాధనలో తరిస్తుంటారు.

More Bhakti Articles