మనసులోని మాటను తెలుసుకున్న స్వామి

మనసులోని మాటను తెలుసుకున్న స్వామి
నిజం కన్నా అబద్ధాన్ని త్వరగా నమ్మడం ... అసలు కన్నా ఆర్భాటాలకు ప్రాధాన్యతను ఇవ్వడం లోకంలో సహజంగా కనిపిస్తూ వుంటుంది. రూపు రేఖలకు ... వస్త్ర ధారణకు ఇచ్చినంత విలువ మరి దేనికీ ఇవ్వకపోవడం అనేక మందిలో చూస్తుంటాం. వీటిని బట్టే వాళ్లు ఎదుటివారిని అంచనా వేయడం జరుగుతుంటుంది.

ఇలాంటి అలవాటు మూలంగానే ఒక శిరిడీ సాయిబాబా ... ఒక అక్కల్ కోటస్వామి వంటి మహనీయులను చాలామంది గుర్తించలేకపోయారు. వాళ్లలో గల ప్రేమానురాగాలను ... దైవత్వాన్ని గ్రహించలేకపోయారు. ఇందుకు నిదర్శనంగా అక్కల్ కోటస్వామి విషయంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకోవచ్చు.

వారసుడు కలగలేదని చాలాకాలంగా బాధపడుతోన్న ఒక వ్యక్తి, అక్కల్ కోటకి చేరుకుంటాడు. స్వామివారికి తన మనసులోని మాటను మనవిచేసుకోవాలని చెప్పి ఆత్రుతగా ఆయన ఆశ్రమానికి చేరుకుంటాడు. అప్పటికే ఎంతో మంది భక్తులు అక్కల్ కోట స్వామి చుట్టూ గుమిగూడి వుంటారు. వాళ్లందరినీ కూడా స్వామి తనదైన రీతిలో అనుగ్రహిస్తూ వుంటాడు. అక్కడ ఎలాంటి ఆడంబరాలు లేకపోవడం ... స్వామి ఎటువంటి హడావిడి చేయకపోవడం ఆ వ్యక్తికి అసంతృప్తిని కలిగిస్తుంది.

స్వామి ధోరణి ఆయనకి చిత్రంగా అనిపిస్తుంది. ఒక మతిస్థిమితం లేని వ్యక్తిని అందరూ గుడ్డిగా నమ్మి ఆరాధిస్తున్నారనే అభిప్రాయానికి వచ్చేస్తాడు. అలాంటి వ్యక్తికి తన మనసులోని కోరికను చెప్పకపోవడమే మంచిదని అనుకుంటాడు. అక్కడి నుంచి వెనుదిరుగుదామని అనుకుంటూ వుండగా, స్వామి చిరునవ్వును చిందిస్తూ ఆయన వైపు చూస్తాడు. అనవసరమైన ఆలోచనలు చేయవద్దనీ ... త్వరలోనే వారసుడు కలుగుతాడని చెబుతాడు.

ఆ మాటలు కూడా ఆ వ్యక్తిపై పెద్దగా ప్రభావం చూపలేకపోతాయి. అందరికీ చెప్పినట్టుగానే తనకి కూడా ఒక మాట చెప్పాడని అనుకుంటూ నిరాశా నిస్పృహలతో ఇంటికి చేరుకుంటాడు. అయితే స్వామి చెప్పిన ప్రకారమే ఒక ఏడాదిలోనే అతనికి వారసుడు కలుగుతాడు. అప్పుడు స్వామిని తాను ఎంత తక్కువగా అంచనా వేసింది ఆయన తెలుసుకుంటాడు. ఆడంబరాలకు అందనంత దూరంగా జీవిస్తూ అడిగిన వరాలను ప్రసాదించే స్వామిని అపార్థం చేసుకున్నందుకు పశ్చాత్తాపపడతాడు. భార్యా బిడ్డలతో కలిసి స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు అందుకుంటాడు.

More Bhakti Articles