అలా ఈ కృష్ణ విగ్రహం అక్కడికి చేరుకుంది !

పుణ్యక్షేత్రాలను దర్శించేటప్పుడు అక్కడ మహర్షుల కారణంగా ఏర్పడిన తీర్థాలు ... దైవ సంకల్పం కారణంగా ఏర్పడిన తీర్థాలు కనిపిస్తుంటాయి. ఈ విధంగా ఏర్పడిన తీర్థాలు ఒక్కొక్కటి ఒక్కో విశిష్టతను కలిగి వుంటాయి. అలాంటి తీర్థాలలో అద్వితీయమైనదిగా 'రుద్ర తీర్థం' దర్శనమిస్తుంది. సాక్షాత్తు పరమశివుడు ఈ తీర్థం దగ్గరే కూర్చుని తపస్సు చేసుకున్నాడంటే, ఇది ఎంతటి పవిత్రమైన తీర్థమో అర్థం చేసుకోవచ్చు.

ఇది మహా విశిష్టమైన తీర్థమని ఆదిదేవుడికి తెలుసుగనుకనే, 'గురువాయురప్పన్' గా పిలవబడుతోన్న కృష్ణుడి విగ్రహాన్ని ఈ తీర్థం ఒడ్డున ప్రతిష్ఠించమని శివుడు సూచించాడు. ద్వాపరయుగం ముగియబోతుందని తెలిసిన శ్రీకృష్ణుడు ... శివుడి ద్వారా బ్రహ్మదేవుడికీ, ఆయన ద్వారా తనకి చేరిన తన విగ్రహాన్ని, మిత్రుడైన ఉద్ధవుడికి అందజేస్తాడు. తన ప్రతిమను బృహస్పతికి ఇచ్చి, యుగాంతం ప్రభావితం చేయలేని ప్రదేశంలో దానిని ప్రతిష్ఠింపజేయమని చెబుతాడు.

ఉద్ధవుడి ద్వారా విషయం తెలుసుకున్న బృహస్పతి, వాయుదేవుడుతో కలిసి కృష్ణుడి ప్రతిమను తీసుకుని ఈ ప్రదేశానికి చేరుకుంటాడు. ఆ సమయంలో శివుడు ఇక్కడి రుద్ర తీర్థం దగ్గర కూర్చుని తపస్సు చేసుకుంటూ వుంటాడు. కృష్ణుడి విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలా అని వాళ్లు ఆలోచిస్తూ ఉండటం చూసి, ఈ తీర్థం ఒడ్డున గల ప్రదేశం అందుకు సరైనదని శివుడు చెబుతాడు. సదాశివుడి సలహా మేరకు వాళ్లు ఆ ప్రతిమను అక్కడే ప్రతిష్ఠిస్తారు.

గురువైన బృహస్పతి వాయువు సహకారంతో ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించడం వలన ఇక్కడి స్వామి 'గురువాయురప్పన్' గా పిలవబడుతున్నాడు. తొలిసారిగా శివుడు ... బ్రహ్మదేవుడికి ఇచ్చిన ఈ కృష్ణుడి విగ్రహం, తిరిగి శివుడు తపస్సు చేసుకుంటోన్న ప్రదేశానికి చేరుకోవడం విశేషం. శివుడి సూచన మేరకు ఆయనకి ఇష్టమైన రుద్ర తీర్థం ఒడ్డున ప్రతిష్ఠించబడటం మరో విశేషం. ఈ కారణంగానే ఈ 'రుద్ర తీర్థం' అత్యంత విశిష్టమైనదిగా ... మహా మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది.


More Bhakti News