నిజమైన భక్తిశ్రద్ధలకు నిర్వచనమే ఆయన !

నిజమైన భక్తిశ్రద్ధలకు నిర్వచనమే ఆయన !
తిరుమల పరమ పవిత్రమైనది ... సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఏర్పరచుకున్న భూలోక వైకుంఠం. అక్కడ ఆవిర్భవించిన వేంకటేశ్వరుడిని దర్శించులోవాలి ... స్వామివారి సేవకి సంబంధించిన విధి విధానాలను పరిశీలించాలి. ఇవన్నీ చేయాలంటే కొండపైకి చేరుకోవాలి. కానీ అంతటి పవిత్రమైన కొండను కాళ్లతో స్పర్శించడానికి శ్రీ రామానుజాచార్యుల వారికి మనసు అంగీకరించలేదు.

సాలగ్రామ శిలా రూపంగా కనిపిస్తోన్న తిరుమలను ఆయన మోకాళ్లతో అధిరోహించాలని నిర్ణయించుకున్నాడు. మనసులోనే స్వామివారికి నమస్కరించుకుని కొండను అధిరోహించడం ప్రారంభించాడు. ఆ సమయంలోనే ఆయన 'మోకాళ్ల మిట్ట' పర్వతం దగ్గర కాసేపు విశ్రాంతి తీసుకున్నాడట. తిరుమల కొండకు నడక దారిలో వెళుతున్న భక్తులకు 'మోకాళ్ల మిట్ట' తారసపడుతుంది. నడకదారిలో అత్యంత కష్టతరమైన ప్రదేశం ఇదే. మిగతా దూరమంతా నడవడం ఒక ఎత్తయితే ... ఇక్కడ నడవడం ఒక ఎత్తు.

అందుకే ఈ మార్గంలో వచ్చే భక్తులంతా ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటూ వుంటారు. రామనుజులవారు ఇక్కడ కాసేపు ఆగారనడానికి గుర్తుగా ఈ ప్రదేశంలో ఆయన మందిరం దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడ ఆయన మూర్తిని చూడగానే, అప్పట్లోనే ఆయన ఈ కొండను మోకాళ్లతో ఎక్కాడనే విషయం గుర్తుకు వస్తుంది. అసమానమైన ఆయన భక్తి శ్రద్ధలను కొనియాడుతూ ఆయన పాదాలపై వాలిపోవాలనిపిస్తుంది.

More Bhakti Articles