భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తాడు ?

మనసునే మందిరంగా మార్చుకుని ... హృదయాన్నే వేదికగా చేసుకుని భగవంతుడిని ప్రతిష్ఠించుకున్న భక్తులు ఎందరో వున్నారు. ఆయన అనుగ్రహంతో అనితరసాధ్యమైనవి సాధించిన వాళ్లు వున్నారు. తాము కూడా అనునిత్యం భగవంతుడిని పూజిస్తున్నాం కదా, అయినా భగవంతుడు తమకి ఎలాంటి అనుభవాలను ఇవ్వడం లేదని కొంతమంది ఆవేదన చెందుతుంటారు. భగవంతుడు ఎవరికి ఎందుకు సమీపంగా వస్తాడో, ఎవరి కోరికలను ఎందుకు మన్నిస్తాడో తెలియక మరికొంత మంది సతమతమైపోతుంటారు.

అయితే భగవంతుడిపై భక్తి శ్రద్ధలు ఉండగానే సరిపోదు. పవిత్రమైన జీవన విధానాన్ని కొనసాగిస్తూ, నిర్మలమైన మనసుతో ఆరాధించేవారిని మాత్రమే ఆయన అనుగ్రహిస్తుంటాడనే విషయం ఎన్నో సందర్భాల్లో నిరూపించబడింది. భగవంతుడుని కొలిచే మనసు కోపం ... ద్వేషం లేకుండా పరిశుద్ధంగా ఉండాలి. ఇందుకు ఉదాహరణగా ధృవుడి జీవితంలో జరిగిన ఒక సంఘటన కనిపిస్తుంది.

సవతి తల్లి 'సురుచి' కారణంగా తండ్రి ప్రేమకు ధృవుడు దూరమవుతాడు. తండ్రి ఒడిలో కూర్చోవాలనే తన బలమైన కోరిక నెరవేరాలంటే తపస్సుచే ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొందాలని నిర్ణయించుకుంటాడు. తన సంకల్పం నెరవేరేలా ఆశీర్వదించమని తల్లి 'సునీతి' ని కోరతాడు. సవతి తల్లి ప్రవర్తనకు మనసు గాయపడటంతో, తపస్సుకు బయలుదేరుతోన్న కొడుకుని ఆమె ఆశీర్వదిస్తుంది. అయితే సహజంగానే ఆ సమయంలో ధృవుడికి సవతి తల్లి పట్ల కోపం ... ద్వేషం ఉంటాయనే విషయాన్ని సునీతి గ్రహిస్తుంది.

కోపం ... ద్వేషం ఉన్న చోటికి రావడానికి భగవంతుడు ఇష్టపడడు. కోపంతో .. ద్వేషంతో రగిలిపోయే హృదయం ప్రశాంతతను పొందలేదు. ప్రశాంతత లేని చోటు నుంచి వచ్చే ఆహ్వానాన్ని ఆ భగవంతుడు అంగీకరించడు. అందువలన సవతి తల్లి పట్ల అతనికి గల ద్వేషాన్ని పోగొట్టాలని సునీతి నిర్ణయించుకుంటుంది. సురుచి ఆ విధంగా ప్రవర్తించడం వెనుక మంచి ఉద్దేశమే ఉందని ధృవుడికి నచ్చజెబుతూ, ఆమె ఆశీర్వాదం కూడా తీసుకోమని కోరుతుంది.

తల్లి మాటలు ఆ పసి హృదయంపై ప్రభావం చూపుతాయి. అతని మనసులోని కోప ద్వేషాలను ఆమె మాటలు పూర్తిగా తుడిచేస్తాయి. తల్లి చెప్పినట్టుగానే సురుచి ఆశీస్సులు కూడా తీసుకుని ధృవుడు అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇప్పుడతని మనసులో కోపం గానీ ... ద్వేషం గాని లేవు. అందుకే భగవంతుడిపై ఏకాగ్రత కుదురుతుంది. నిర్మలమైన మనసుతో అతను ప్రార్ధించడం వల్లనే ఆ భగవంతుడు దిగివస్తాడు ... అనునయిస్తూ అక్కున చేర్చుకుని అనుగ్రహిస్తాడు.


More Bhakti News