ఎవరిని ముందుగా దర్శించుకోవాలి ?

ఎవరిని ముందుగా దర్శించుకోవాలి ?
శ్రీనివాసుడు కొలువైన క్షేత్రాలకి వెళ్లినప్పుడు అక్కడ స్వామివారు ... అమ్మవార్లు కొలువుదీరి వుండటం జరుగుతూ వుంటుంది. కొన్ని ఆలయాల్లో స్వామివారితో పాటే అమ్మవార్లు గర్భాలయంలో కొలువై వుంటారు. మరికొన్ని ఆలయాల్లో స్వామివారు మాత్రమే గర్భాలయంలో వుండగా, అమ్మవార్లు ఆ పక్కనే గల ప్రత్యేక మందిరాలలో దర్శనమిస్తూ వుంటారు.

ఇంకా కొన్ని క్షేత్రాల్లో స్వామివారు కొండపై కొలువుదీరి వుండగా, అమ్మవారు కొండ దిగువున కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఎవరిని ముందుగా దర్శించుకోవాలి ? అనే సందేహం భక్తులకు కలుగుతూ వుంటుంది. గర్భాలయంలో స్వామివారితో పాటు అమ్మవారు కూడా కొలువై వుంటే అంతకన్నా ఆనందం లేదు. ఒకవేళ అదే ప్రాంగణంలో వేరుగా వుంటే, ముందుగా ధ్వజ స్తంభాన్ని దర్శించి, ఆ తరువాత అమ్మవారిని దర్శించడం మంచిది.

లోకంలో తల్లి దగ్గరే బిడ్డలకు ఎక్కువ చనువు వుంటుంది. బిడ్డల మనసును తల్లి మాత్రమే త్వరగా అర్థం చేసుకోగలుగుతుంది. అవసరమైతే భర్తతో చెప్పి బిడ్డలకి కావలసినవి అందజేస్తుంది. అందువలన అమ్మవారిని ముందుగా దర్శించుకోవాలనే ఉద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అమ్మవారిని ముందుగా దర్శించుకోవడమనేది స్వామి వారికీ సంతోషాన్ని కలిగించే విషయమే.

అమ్మవారి దగ్గరికి వెళ్లివచ్చామనే విషయం దగ్గర నుంచి, మనసులోని కోరికలను స్వామివారితో చెప్పుకోవాలి. స్వామివారినీ ... ఆయన వాహనాలను దర్శించుకుని, ప్రదక్షిణ క్రమంలో పరివార దేవతలకు నమస్కరిస్తూ వెళ్లాలి. ఒకవేళ ముందుగా అమ్మవారిని దర్శించుకునే అవకాశం లేకపోతే, స్వామివారిని దర్శించిన తరువాత అక్కడికి వెళ్లవచ్చు. ఇద్దరిలో ఎవరిని ముందుగా దర్శించుకోవాలి అనే సంగతిని అటుంచితే, ఇద్దరినీ దర్శించుకోవాలనే విషయాన్ని మరచిపోకూడదు.

అమ్మవారిని దర్శించి స్వామివారి దగ్గరికి వెళ్లకుండా రావడం కానీ, స్వామివారిని దర్శించి అమ్మవారిని చూడకుండా రావడం కాని చేయకూడదు. ఆ విధంగా చేయడం వలన క్షేత్ర దర్శనానికి సంబంధించిన పరిపూర్ణమైన ఫలితం దక్కదని చెప్పబడుతోంది. అందువల్లనే తిరుమలలో శ్రీవారిని దర్శించిన భక్తులు తప్పని సరిగా తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని దర్శిస్తూ వుంటారు.

More Bhakti Articles