సిందూరాభిషేకం

సిందూరాభిషేకం
సాధారణంగా ప్రతి ఊరులోను రామాలయం వుంటుంది. అలాగే ప్రతి రామాలయంలోను హనుమంతుడి విగ్రహం కూడా వుంటుంది. ఇక హనుమంతుడు విగ్రహ రూపంలో ఉన్నా ... రాయిపై చెక్కబడి ఉన్నా ఆయన వంటికి మొత్తం 'సిందూరం' రాసి కనిపిస్తుంది. హనుమంతుడికి సిందూరమంటే ఇష్టమేమో అనుకుని కొందరూ, ఆచారంగా భావించి కొందరు ఆయనకి సిందూర అభిషేకం చేయిస్తుంటారు.

అయితే ఈ ఆచారం వెనుక మనకు హనుమంతుడి ప్రభు భక్తిని చాటే ఓ అందమైన కథ కనిపిస్తోంది. ఒక రోజున సీతమ్మవారు తన నుదుటున సిందూర తిలకాన్ని దిద్దుకోవడం చూసిన హనుమంతుడు, ఆ విధంగా చేయడంలోని ఆంతర్యమేమిటని అడిగాడు. స్త్రీకి బొట్టు మంగళకరమనీ ... ఆమె సౌభాగ్యానికి అది ప్రతీకయని చెప్పింది. ఈ విధంగా సిందూరాన్ని ధరించడం వలన భర్త ఆయుషు పెరుగుతుందని వివరించింది.

రాములవారి ఆయుష్షు పెరగడానికే సీతమ్మవారు సిందూరాన్ని ధరిస్తుందనే ఒక్కమాట మాత్రమే హనుమంతుడికి అర్ధమైంది. అంతే హడావిడిగా అటూ ఇటూ చూసి అక్కడి నుంచి పరిగెత్తాడు. కొంత సేపటి తరువాత తిరిగి వచ్చిన హనుమంతుడిని చూసి సీతమ్మ వారు ఆశ్చర్యపోయింది. ఆయన ఒళ్లంతా సిందూరాన్ని పులుముకుని రావడమే అందుకు కారణం.

హనుమంతుడుని ఆ విధంగా చూసిన సీతమ్మ వారు, అతనలా చేయడానికి కారణమేమిటని అడిగింది. రాముడి ఆయుష్షు పెరగాలనే తాను సిందూరాన్ని పులుముకున్నాననీ, ఇక మీదట సిందూరం లేకుండా కనిపించనని హనుమంతుడు అన్నాడట. ఆ ఒక్కమాట సీతమ్మ వారిని కదిలించి వేసింది. దాంతో చిరంజీవిగా సిందూరాభిషేకాలు అందుకోమంటూ ఆ తల్లి ఆయనను దీవించిందట. శ్రీ రాముడు క్షేమాన్ని కోరి హనుమంతుడు సిందూరాన్ని ధరించిన కారణంగా, ఆయనకి అవసరమైన సిందూరాన్ని అభిషేకం ద్వారా అందజేయడం ఆచారంగా మారిపోయింది.

More Bhakti Articles