భగవంతుడు ఆశించేది భక్తి శ్రద్ధలు మాత్రమే

 భగవంతుడు ఆశించేది భక్తి శ్రద్ధలు మాత్రమే
భగవంతుడిని చాలామంది పూజిస్తుంటారు ... ఆరాధిస్తూ వుంటారు ... అవకాశం దొరికితే చాలు ఆయన సేవలో పాల్గొంటూ వుంటారు. అయితే ఏది చేసినా అది మనస్పూర్తిగా ... అంకితభావంతో చేయాలి. అనుకున్నదేదైనా సంతోషంగా సమర్పించాలి. అప్పుడే ఆ సేవను భగవంతుడు గుర్తిస్తాడు ... అందుకు తగిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

కొంతమందికి భగవంతుడిపట్ల భక్తికన్నా భయమే ఎక్కువగా ఉంటుంది. పక్కింటివాళ్లు గుడికి వెళితే, తాము వెళ్లకపోవడం వలన తమపట్ల భగవంతుడికి ఆగ్రహం కలుగుతుందేమోననే ఉద్దేశంతో వీళ్లు కూడా బయలుదేరుతుంటారు. దైవకార్యానికి సంబంధించి ఎవరైనా వచ్చి విరాళం అడిగితే, ఇవ్వకపోతే ఆయనకి కోపం వస్తుందని ఇచ్చేస్తుంటారు. ఫలానా పుణ్యక్షేత్రానికి వెళదామా ? అని ఎవరైనా అడిగితే, రానని చెప్పడానికి భయపడతారు. అలా చెబితే దేవుడి ఆగ్రహానికి గురికావలసి వస్తుందని అనుకుంటారు.

ఇలా భగవంతుడికి భయపడుతూనే ఆయన సేవల్లో పాల్గొంటూ వుంటారు. నిజానికి ఇది పరిపక్వత లేని పరిస్థితిగా చెప్పుకోవచ్చు. తమలాగే భగవంతుడు ఆలోచిస్తాడని అనుకోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వస్తుంటుంది. నిజానికి భగవంతుడి మనసు మంచుకొండకన్నా చల్లనైనది ... మహా సముద్రం కన్నా విశాలమైనది. భక్తి శ్రద్ధలను తప్ప మరేది ఆయన తన భక్తుల నుంచి ఆశించడు. పరిస్థితులను బట్టి తన దగ్గరికి రాలేని వాళ్లు వుంటే, ఆ పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేస్తాడేగానీ, వాళ్లపై కన్నెర్ర జేయడు.

కాబట్టి భగవంతుడికి సంబంధించిన ఏ సేవనైనా భయపడుతూ చేయకూడదు. భగవంతుడి తత్త్వాన్ని అర్థం చేసుకుని, పరిస్థితులకు అనుగుణంగా ... తమ స్థాయికి తగినవిధంగా ఆయన సేవలో పాల్గొనవచ్చు. నిస్వార్ధంతో ... నిర్మలమైన ప్రేమతో ... మనసు నిండిన భక్తితో ఆయనకి గోరంత సమర్పిస్తే, కొండంత అనుగ్రహిస్తాడనే విషయాన్ని మరచిపోకూడదు.

More Bhakti Articles