అదే ఈ పుష్కరిణి ప్రత్యేకత !

అదే ఈ పుష్కరిణి ప్రత్యేకత !
సాధారణంగా పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లిన వాళ్లు, అక్కడి పుణ్యతీర్థాలలో స్నానమాచరించి దైవదర్శనం చేసుకుంటూ వుంటారు. ఎటు చూసినా ఎత్తైన కొండలు మాత్రమే కనిపించే క్షేత్రాలకు వెళ్లినప్పుడు, అక్కడ స్వచ్ఛమైన నీటితో నిండిన తీర్థాలు ఎలా ఏర్పడ్డాయా అనే ఆశ్చర్యం కలుగుతూ వుంటుంది. ఈ పుణ్యతీర్థాలు ఏర్పడటం గురించి ఒక్కో క్షేత్రంలో ఒక్కో ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ వుంటుంది.

చాలా వరకూ ఆయా క్షేత్రాలలోని ప్రధాన దైవాల సంకల్పం మేరకే ఈ తీర్థాలు ఆవిర్భవించినట్టు స్థలపురాణాన్ని బట్టి తెలుస్తూ వుంటుంది. ఈ నేపథ్యంలో శ్రీమహావిష్ణువు చక్రంతో సృష్టించిన తీర్థాలు ... శివుడు త్రిశూలాన్ని నేలకు తాకించడం వలన ఏర్పడిన తీర్థాలు ... శివకేశవుల పాదముద్రల నుంచి ఏర్పడిన తీర్థాలు కనిపిస్తుంటాయి. అలాగే శ్రీమహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి, ఆ రూపంతో స్వయంగా తవ్విన తీర్థాలు కూడా ఈ జాబితాలో మనకి కనిపిస్తుంటాయి.

అలా ఆవిర్భవించిన తీర్థం మనకి కృష్ణాజిల్లా 'ఆగిరిపల్లి'లో కనిపిస్తుంది. లక్ష్మీనృసింహస్వామి కొలువుదీరిన ఈ క్షేత్రంలో, 'వరాహపుష్కరిణి' ప్రత్యేకతను సంతరించుకుని దర్శనమిస్తుంది. స్వామివారు ఆవిర్భవించినప్పుడు ఈ కొండపై ఎలాంటి జలాశయం లేకపోవడంతో, ఆయన వరాహ రూపాన్ని ధరించి ఈ కోనేరును తవ్వినట్టు స్థలపురాణం చెబుతోంది.

కొన్ని పుణ్యతీర్థాలు అందులో స్నానం చేయడం వలన మాత్రమే ఫలితాన్ని ప్రసాదిస్తూ వుంటాయి. మరికొన్ని తీర్థాలు వాటిలోని నీటిని తలపై చల్లుకున్నందు వల్లనే శుభాలను చేకూరుస్తుంటాయి. అలాంటిది ఈ క్షేత్రంలోని వరాహ పుష్కరిణిని చూడటం వల్లనే సమస్త పాపాలు నశించి, ఉత్తమగతులు కలుగుతాయని చెప్పబడుతోంది. ఈ కారణంగా ఇది మరింత మహిమాన్వితమైన తీర్థంగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

More Bhakti Articles