భక్తుల విన్నపాన్ని కాదనలేని భగవంతుడు

భక్తుల విన్నపాన్ని కాదనలేని భగవంతుడు
భగవంతుడిని ఆరాధిస్తూ వెళ్లిన కొద్దీ, ఆయనతో విడదీయరాని అనుబంధం పెరిగిపోతూ వుంటుంది. దాంతో ఆయనను చూడకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది. భగవంతుడికి దూరంగా భక్తుడు క్షణకాలం కూడా ఉండలేకపోతే, అలాంటి భక్తులను విడిచి ఆ భగవంతుడు అరక్షణమైనా ఉండలేడు. అంతటి కరుణామూర్తి కనుకనే ఆయన తన భక్తుల విన్నపాలను వింటూ వుంటాడు. ఆ భక్తుల సంతోషం కోసం ... సంతృప్తి కోసం తన మనసును సైతం మార్చుకుంటూ వుంటాడు.

త్యాగరాజు జీవితంలోని ఓ సంఘటన ఇందుకు ఉదాహరణగా కనిపిస్తూ వుంటుంది. శ్రీరాముడి పట్ల త్యాగరాజుకి గల అసమానమైన భక్తిని చూసి ఆ ఊళ్లో వాళ్లంతా ఆయనని ఎంతో గౌరవంగా చూస్తుంటారు. అది సహించలేకపోయిన ఆయన వదినగారు, ఆ కుటుంబాన్ని నానాఇబ్బందులు పెడుతుంది. తమ్ముడని కూడా చూడకుండా ఆ పాపంలో ఆమె భర్త పాలుపంచుకుంటాడు.

త్యాగరాజు విషయంలో సోదరుడు ద్రోహానికి పాల్పడటాన్ని క్షమించలేకపోయిన భగవంతుడు, ఆయన మంచంపట్టేలా చేస్తాడు. తన పని కూడా తాను చేసుకోలేని పరిస్థితుల్లో వున అన్నగారిని చూసి త్యాగరాజు బాధపడతాడు. ఆయనకి తాను తలపెట్టిన అపకారమే తనని ఈ దుస్థికి తీసుకువచ్చిందని ఆయన సోదరుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. అనారోగ్యంతో తను పడుతోన్న నరకబాధల నుంచి విముక్తిని కల్పించమని కోరతాడు.

ఆ మాటలకు త్యాగరాజు హృదయం ద్రవిస్తుంది ... తన అన్నగారి తప్పులను క్షమించి ఆయనని ఆరోగ్యవంతుడిని చేయవలసిందిగా త్యాగరాజు ఆ శ్రీరామచంద్రుడిని ప్రార్ధిస్తాడు. భక్తుడి వినపాన్ని కాదనలేకపోయిన శ్రీరాముడు, ఆయన సోదరుడిని పూర్తి ఆరోగ్యవంతుడిని చేస్తాడు. భగవంతుడి సేవ ఎంతటి పుణ్య ఫలితాలను ప్రసాదించగలదో ప్రత్యక్షంగా తెలుసుకున్న త్యాగరాజు సోదరుడు, ఆ క్షణం నుంచి పూర్తిగా మారిపోతాడు. భగవంతుడి సేవలో తన తమ్ముడికి సాయాన్ని అందిస్తూ తన జన్మను సార్ధకం చేసుకుంటాడు.

More Bhakti Articles