స్త్రీరూప గణపతిని ఇక్కడ చూడవచ్చు !

స్త్రీరూప గణపతిని ఇక్కడ చూడవచ్చు !
సాధారణ మానవుల నుంచి మహర్షులు ... దేవతలు సైతం వినాయకుడిని పూజిస్తూ వుంటారు. దైవకార్యాల ఆరంభంలోను ... శుభకార్యాల ప్రారంభంలోను వినాయకుడిని పూజిస్తూ వుండటం పురాణకాలం నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో పదకొండు ... ఇరవై ఒకటి ... ముప్పైరెండు ... నూటా ఎనిమిది వినాయక రూపాలు విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి.

ఒక్కో రూపాన్ని కలిగిన వినాయకుడు ఒక్కో నామంతో పిలవబడుతూ ఉంటాడు. ఒక్కో భంగిమలో దర్శనమిచ్చే ఈ వినాయకులను పూజించడం వలన ఒక్కో ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇలా విభిన్న రూపాలలో గల గణపతులు వివిధ క్షేత్రాల్లో కనిపిస్తూ వుంటారు. అయితే ఎక్కడాలేని విధంగా స్త్రీరూపంలో వినాయకుడు కనిపించే క్షేత్రం ఒకటుంది ... అదే 'సుచీంద్రం'.

తమిళనాడు ప్రాంతానికి చెందిన ఈ ప్రసిద్ధ క్షేత్రంలో వినాయకుడు స్త్రీరూపంలో కనిపిస్తూ వుండటం విశేషం. ఇందుకు గల కారణంగా ఇక్కడ అనేక ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తూ వుంటాయి. ఈ క్షేత్రంలో చోటుచేసుకున్న అనేక విచిత్రాలలో ... మహిమలలో ఒకటిగా స్త్రీరూప వినాయకుడు కనిపిస్తుంటాడు. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులందరూ ఈ వినాయకుడిని దర్శించుకోకుండా వెళ్లరు.

స్త్రీరూపంలో వినాయకుడు ఉంటాడనే ఆలోచన కలగకపోవడం ... ఎక్కడా ఆయన స్త్రీరూపంలో ఉండకపోవడం వలన ఇక్కడి ప్రతిమను చూడగానే చిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఈ స్వామి దర్శనం చేసుకోవడం వలన, సమస్యలన్నీ తొలగిపోయి సకల శుభాలు చేకూరతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.

More Bhakti Articles