అందుకే ఇక్కడ కాకులు కనిపించవట !

అందుకే ఇక్కడ కాకులు కనిపించవట !
సాధారణంగా కొన్ని క్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడ కాకులు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాకులు లేకపోవడానికి గల కారణమేమిటని అడిగితే, ఒక్కో క్షేత్రంలో ఒక్కో ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ వుంటుంది. ఇలా కాకులు కనిపించని క్షేత్రాలు చాలా అరుదుగా ఉండటం వలన, అవి మరింత విశేషాన్ని సంతరించుకుంటున్నాయి. అలాంటి అరుదైన క్షేత్రాల్లో ఒకటిగా 'కోటప్పకొండ' కనిపిస్తూ వుంటుంది.

గుంటూరు జిల్లాలో చెప్పుకోదగిన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా కోటప్పకొండ దర్శనమిస్తూ వుంటుంది. ఈ క్షేత్రంలో కాకులు తిరగక పోవడానికి 'ఆనందవల్లి' అనే గొల్లభామ కారణమని స్థలపురాణం చెబుతోంది. పూర్వం ఈ కొండపైకి ప్రతినిత్యం ఆనందవల్లి అనే గొల్లభామ వచ్చేదట. ఆమె మహా శివభక్తురాలు ... ఆయనకి పూజచేసి నైవేద్యంగా పాలు సమర్పించనిదే ఎంగిలిపడేది కాదు. ఆదిదేవుడు కూడా అనుదినం ఆమె పూజ కోసమే ఎదురుచూస్తూ కూర్చునేవాడట.

ఆ దేవదేవుడితో ఆమె నేరుగా మాట్లాడేదని అప్పట్లో చెప్పుకునేవాళ్లు. అలాంటి ఆ భక్తురాలు కొండ కిందనుంచి కుండలో తెచ్చిన నీళ్లతో ఇక్కడి శివయ్యకు ప్రతిరోజు అభిషేకం చేసి వెళుతూ ఉండేది. ఒకసారి ఆమె కొండపైకి నీళ్లు తెచ్చి శివయ్య ముందుపెట్టి, ఎప్పటిలాగానే మారేడు దళాలు సేకరించడానికి వెళ్లింది. ఆ సమయంలో ఆ కుండలో నీళ్లు తాగడానికి వచ్చిన కాకి దానిపై వాలింది. దాంతో కుండ పడిపోయి దొర్లుకుంటూ పోవడంతో అందులోని నీళ్లన్నీ ఒలికిపోయాయి.

మారేడు దళాలతో తిరిగి వచ్చిన ఆమె ఈ దృశ్యాన్ని చూసింది. ఎంతో కష్టపడి కొండకింద నుంచి మోసుకొచ్చిన నీళ్లను అలా నేలపాలు చేసిన కాకిపై ఆమెకి ఆగ్రహం కలిగింది. తాను చేస్తోన్న స్వామివారి సేవకు భంగం కలిగించిన కారణంగా, ఇకమీదట ఆ క్షేత్రంలో కాకులకు ప్రవేశం లేదంటూ శపించింది. మహేశ్వరుడి మనసు గెలుచుకున్న మహాభక్తురాలు కావడంతో, ఆ శాపం ఫలించింది. ఈ కారణంగానే ఈ క్షేత్రంలో చూద్దామన్నా ఒక్క కాకి కూడా కనిపించదు. ఒక వైపున కాకులు కనిపించకపోవడం ... మరోవైపున అందుకు సంబంధించి ఆసక్తికరమైన కథ వినిపించడం ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన భక్తులకు ఒక చిత్రమైన అనుభూతిని కలిస్తుంది.

More Bhakti Articles