అమ్మవారి అనుగ్రహముంటే చాలు

అమ్మవారి అనుగ్రహముంటే చాలు
అవంతీపుర రాకుమారి అయిన విద్యావతి .. కాళికాదేవి భక్తురాలు. ప్రతినిత్యం ఆ తల్లి దర్శనం చేసుకోనిదే ఆమె మంచినీళ్లు కూడా తాగేది కాదు. ఆమె అందచందాల గురించి ... భక్తి శ్రద్ధల గురించి పొరుగు రాజ్యాలవారు సైతం గొప్పగా చెప్పుకునే వాళ్లు. లోకంలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ప్రఖ్యాతులను సంపాదించే యువకుడిని తనకి భర్తగా ప్రసాదించమని అమ్మవారిని విద్యావతి కోరుతూ వుండేది.

అయితే కొన్ని నాయకీయ పరిణామాల కారణంగా ఆమె వివాహం 'కాలుడు' అనే గొర్రెలకాపరితో జరుగుతుంది. కాలుడిని మహాపండితుడిగా చిత్రీకరించి, రాజుని ... రాకుమారిని మంత్రి మోసం చేస్తాడు. అయితే జరిగిన మోసం గురించి ముందుగా రాకుమారికి తెలుస్తుంది. కాలుడి గురించి నిజం తెలుస్తే తన తండ్రి బతకడని ఆమె ఆందోళన చెందుతుంది.

తన ఇష్టదైవమైన కాళికాదేవి పాదాలపైపడి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తెలియక తానేదైనా అపరాథం చేసివుంటే మన్నించమని కోరుతుంది. కాలుడితో వివాహం ఆ తల్లి ఆశీర్వాదంగా భావిస్తున్నానని చెబుతుంది. కాలుడిని అనుగ్రహించి మహా పండితుడిని చేయమని ప్రాధేయపడుతుంది. ఆమె ఆవేదన చూస్తుంటే తాను ఎంత పొరపాటు చేసినది తనకి అర్థమవుతోందనీ, ఆమె కోరిక మేరకు తనకి పాండిత్యాన్ని ప్రసాదించమని కాలుడు కోరతాడు.

ఒకవైపున భక్తురాలి విన్నపం ... మరోవైపున నిర్మలమైన మనసుతో .. అమాయకత్వంతో కాలుడు చేసే అభ్యర్థన అమ్మవారి మనసును కరిగిస్తాయి. ఆ క్షణమే ఆమె సకలశాస్త్రాల సారాన్ని కాలుడికి అనుగ్రహిస్తుంది. అలా అమ్మవారి అనుగ్రహంతో కాలుడు ... కాళిదాసుగా మారిపోతాడు. తనతో పోల్చదగిన కవి మరొకరు లేరనే విధంగా శాశ్వతంగా నిలిచిపోయే కీర్తి ప్రతిష్ఠలను సంపాదిస్తాడు.

More Bhakti Articles