వేదాలకు నెలవైన వేదాద్రి

వేదాలకు నెలవైన వేదాద్రి
'వేదాద్రి' ... నరసింహ స్వామి అవతరించిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రాలలో ఒకటి. వేదాలను తనలో నిక్షిప్తం చేసుకున్నపర్వత ప్రదేశం కనుక ఈ క్షేత్రానికి 'వేదాద్రి' అనే పేరు వచ్చింది. కృష్ణానది తీరంలో కొలువుదీరి పుణ్య ఫలాలను అందించే ఈ దివ్య క్షేత్రం కృష్ణా జిల్లాకి వన్నె తెస్తూ భక్తుల హృదయాలను గెలుచుకుంటూ వుంది.

ఇక స్థల పురాణంలోకి వెళితే ... 'సోమకాసురుడు' అనే రాక్షసుడు బ్రహ్మ దేవుడి దగ్గర నుంచి వేదాలను అపహరించి వాటిని సముద్ర గర్భంలో దాచేశాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు మత్స్యావతారమెత్తి సోమకాసురుడిని సంహరించి వేదాలను రక్షించాడు. అప్పుడు వేదాలు స్వామివారి సన్నిధిలో తరించే భాగ్యాన్ని కలిగించమని కోరడంతో, నరసింహవతారంలో హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం ఆ కోరిక తీరుతుందని స్వామి చెప్పాడు. తనని అభిషేకించాలని 'కృష్ణవేణి' కూడా ఆరాట పడుతుందనీ, అందువలన తాను వచ్చేంత వరకూ ఆ నదిలో సాలగ్రామ శిలలుగా వుండమంటూ అనుగ్రహించాడు. ఆ తరువాత హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం, స్వామి అక్కడే అయిదు అంశలతో ఆవిర్భవించాడు.

'జ్వాలా నరసింహ స్వామి' ... 'సాలగ్రామ నరసింహ స్వామి' ... 'వీర నరసింహ స్వామి' ... ' యోగానంద నరసింహ స్వామి' ... లక్ష్మీ నరసింహ స్వామి' అనే అయిదు అంశలతో అవతరించిన స్వామి భక్తులపాలిట కొంగు బంగారమై అలరారుతున్నాడు. అయితే ఈ అయిదు అంశలలో ప్రధాన మూర్తిగా ... ప్రత్యేక శక్తిగా 'యోగానంద నరసింహ స్వామి' పూజలందుకుంటూ ఉంటాడు. ఇక కలియుగారంభంలో మానవులు తపస్సులు చేయవలసిన అవసరం లేదనీ, దైవ నామస్మరణ చేస్తే చాలని వ్యాస భగవానుడు చెప్పాడు. దాంతో ఋషులంతా దైవ నామ సంకీర్తన చేస్తూ దేశాటన చేయసాగారు. ఆ సమయంలోనే కృష్ణానది నదీ తీరంలోగల పర్వతం పై నుంచి వేదాలు వినిపించడం వారికి ఆశ్చర్య కలిగించింది. వేద పురుషులతో సహా శ్రీ మన్నారాయణుడు నరసింహ అవతారంలో అక్కడ వెలిశాడని తెలుసుకుని దర్శించి తరించారు.

వేదాద్రి క్షేత్ర మహాత్మ్యాన్ని గురించిన ప్రస్తావన శ్రీనాథుడి 'కాశీ ఖండం' లో కనిపిస్తుంది. ఇక ఎర్రా ప్రగడ ... నారాయణ తీర్థులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్టు తెలుస్తోంది. 'విశ్వేశ్వరుడు' క్షేత్ర పాలకుడిగా వ్యవహరించే ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. విశేషమైనటు వంటి పర్వదినాల్లో భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో ఈ క్షేత్రం కళకళలాడుతూ కనిపిస్తుంది.

More Bhakti Articles