నవధాన్యాలు

నవధాన్యాలు
నవధాన్యాలను నవగ్రహాలకు సంకేతంగా భావిస్తుంటారు. సూర్యుడికి గోధుమలు ... చంద్రుడికి బియ్యము ... కుజ గ్రహానికి కందులు ... బుధ గ్రహానికి పెసలు ... గురు గ్రహానికి సెనగలు ... శుక్ర గ్రహానికి బొబ్బర్లు ... శని గ్రహానికి నువ్వులు ... రాహుగ్రహానికి మినుములు ... కేతు గ్రహానికి ఉలవలు అధీన ధాన్యాలుగా చెప్పబడ్డాయి. దైవకార్యాల్లోను ... శుభకార్యాలలోను నవధాన్యాలకు ఎంతో విశిష్టమైన స్థానం వుంది.

వివాహ సమయంలో ఈ నవధాన్యాలను మట్టి మూకుళ్లలోపోసి ఉంచడమనే ఆచారం వుంది. అవి మొలకెత్తి బాగా పెరిగితే ఆ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని భావిస్తారు. అంతే కాకుండా నవధాన్యాల ... నవగ్రహాల అనుగ్రహం వారిపై బాగానే ఉంటుందని విశ్వసిస్తారు. నవధాన్యాలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి వుండి ... ఎంతో బలమైన పోషకాలను అందిస్తాయి. ఆ పోషకాలను స్వీకరిస్తూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించమనే అర్థం కూడా ఇందులో వుంది.

నవధాన్యాలలో ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకమైన గుణాన్ని కలిగి వున్నాయి. వాటిని సమపాళ్లలో స్వీకరించినప్పుడే దేహానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. జీవితంలో కూడా అన్ని రకాల మనస్తత్వాలు గల వాళ్లని కలుపుకు పోయినప్పుడే, పరిపూర్ణత ఏర్పడుతుందనే విషయాన్ని కూడా ఇది స్పష్టం చేస్తుంది. మొత్తం మీద నూతన వధూవరులిద్దరూ ఇటు నవగ్రహాలను ... వాటితో అనుసంధానించబడిన ధాన్యాల అనుగ్రహాన్ని పొందడమే ఉద్దేశంగా ఈ తంతు కొనసాగుతుందని చెప్పవచ్చు.

More Bhakti Articles