ఇదంతా దాంపత్య జీవితం బాగుండటం కోసమే !

సాధారణంగా ఒక్కో పుణ్యక్షేత్రంలో ఒక్కో ఆచారం కనిపిస్తూ వుంటుంది. అది దర్శనం విషయంలో కావొచ్చు .. ప్రసాదాల విషయంలో కావొచ్చు .. మొక్కుబడుల విషయంలో కావొచ్చు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఈ ఆచారాలు కాస్త చిత్రంగా అనిపిస్తూ వుంటాయి. కొంతమంది ఈ ఆచారాలపట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటారు ... మరికొందరు ఆ ఆచారాల వెనుక అర్థం ఏదో ఉండేవుంటుందని అనుకుంటూ వుంటారు.

అలాంటి చిత్రమైన ఆచారం ఒకటి మనకి 'శ్రీ ఉమాసోమేశ్వరస్వామి' క్షేత్రంలో కనిపిస్తుంది. పంచారామాలలో ఒకటిగా విలసిల్లుతోన్న ఈ క్షేత్రం, పశ్చిమగోదావరి జిల్లా 'గునుపూడి'లో దర్శనమిస్తుంది. సాధారణంగా దైవదర్శనం కోసం వెళ్లినప్పుడు ఎవరి స్తోమతను బట్టి వాళ్లు ధన .. కనక .. వస్తు ... వాహనాల రూపంలో స్వామివారికి కానుకలు ... మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు.

అందుకు భిన్నమైన వాతావరణం మనకి ఈ క్షేత్రంలో కనిపిస్తుంది. ఈ క్షేత్రానికి వచ్చిన నూతనదంపతులు స్వామివారికి 'గుమ్మడికాయను' సమర్పించుకోవడం ఆచారంగా వస్తోంది. తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారం వెనుక బలమైన విశ్వాసమే అర్థంగా కనిపిస్తూ ఉంటుంది. నూతనదంపతులు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారికి గుమ్మడికాయను సమర్పించడం వలన, తమ దాంపత్యం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా సాగిపోతుందని భావిస్తుంటారు.

ఇక వైవాహిక జీవితంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఆ దంపతులు కూడా ఈ స్వామివారిని దర్శించి గుమ్మడికాయను సమర్పిస్తూ ఉంటారు. గుమ్మడికాయను స్వీకరించిన స్వామి, ఆయా దంపతుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో కొనసాగేలా చేస్తాడనీ, ఇందుకు నిదర్శనంగా ఇక్కడ ఎన్నో జంటలు తారసపడుతూ ఉంటాయని స్థానికులు చెబుతుంటారు.


More Bhakti News