ఒకే గర్భాలయంలో శివకేశవ దర్శనం

శివకేశవులకు భేదం లేదు ... వాళ్లు తమ కర్తవ్య నిర్వహణలో సఖ్యతను ... సమైక్యతను కలిగివుంటారు. లోక కల్యాణం కోసం తలపెట్టే కార్యాలలో ఒకరికొకరు సహకరించుకుంటారు. ఒకరినొకరు ఆరాధించుకోవడమే కాదు, ఒకరి క్షేత్రంలో ఒకరు ఆవిర్భవిస్తుంటారు. ఒకరి క్షేత్రానికి ఒకరు క్షేత్రపాలకులుగా వ్యవహరిస్తూ వుంటారు. అలా వాళ్లిద్దరూ కొలువైన క్షేత్రాలు ఎన్నో ప్రాంతాలలో కనిపిస్తూ వుంటాయి.

అయితే ఒకే గర్భాలయంలో వాళ్లు కొలువైన క్షేత్రాలు చాలా అరుదుగా ఉన్నాయనే చెప్పాలి. అలాంటి అరుదైన క్షేత్రాలలో ఒకటిగా గోవా ప్రాంతానికి చెందిన 'రామనాథం' కనిపిస్తుంది. శ్రీరాముడి కారణంగానే ఈ క్షేత్రం ఈ పేరుతో పిలవబడుతోంది. రావణ సంహారం అనంతరం శ్రీరాముడు ఆ పాపం నుంచి బయటపడటం కోసం, అనేక ప్రదేశాల్లో శివలింగ ప్రతిష్ఠలు చేశాడు. అలా రాముడు ఇక్కడ లక్ష్మీనారాయణుల సన్నిధిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు.

ఈ కారణంగా ఇక్కడి గర్భాలయంలో శివకేశవులు కలిసి పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు. ఇక ఇటు విష్ణుమూర్తికి అటు శివుడికి సంబంధించిన పరివార దేవతలు ఆలయ ప్రాంగణంలో దర్శనమిస్తూ వుంటారు. ప్రాచీనకాలం నాటి ఈ ఆలయం ఆనాటి శిల్పకళా వైభవానికి ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది. గోపురాలు ... ప్రాకారాలు ... మంటపాలు ... పైకప్పు లోపలిభాగాల నిర్మాణ శైలిని పరిశీలిస్తే, ఆనాటి రాజుల భక్తి శ్రద్ధలను అభినందించకుండా ఉండలేరు.

విశేషమైన పర్వదినాల్లో ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఘనంగా ... ఉత్సాహంగా జరిపే ఈ ఉత్సవాలను చూసి తీరవలసిందే. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన శివకేశవుల అనుగ్రహం ఏకకాలంలో పొందినట్టు అవుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News