తనని తాను మరిచిపోయిన హనుమంతుడు

తనని తాను మరిచిపోయిన హనుమంతుడు
వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు శయన భంగిమలో ఒక్క శ్రీమహావిష్ణువు మాత్రమే కనిపిస్తుంటాడు. శ్రీమహావిష్ణువు రూపాలైన అనంతపద్మనాభస్వామి ... రంగనాథస్వామి ... గోవిందరాజస్వామి గర్భాలయాల్లో శయనమూర్తులుగా ఉంటూనే, భక్తులను అనుగ్రహిస్తుంటారు. ఈ నేపథ్యంలో శ్రీరాముడో ... శ్రీకృష్ణుడో శయన భంగిమలో కనిపించినా భక్తులకు కాస్త విచిత్రంగా అనిపిస్తూ వుంటుంది. అలాంటిది హనుమంతుడు శయన భంగిమలో కనిపిస్తే అమితాశ్చర్యానికి లోనుకావడం ఖాయం.

సాధారణంగా హనుమంతుడు స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలను పరిశీలిస్తే, వీరాంజనేయస్వామిగా నుంచుని ... ధ్యానాంజనేయస్వామిగా కూర్చుని మాత్రమే దర్శనమిస్తూ ఉంటాడు. అంతే గాని ఆయన ఎక్కడా శయనముద్రలో కనిపించడు. ఆలా ఆయన దర్శనమిచ్చే క్షేత్రం మనకి మహారాష్ట్రలోని 'ఖుల్తాబాద్'లో దర్శనమిస్తుంది. ఇది మహిమాన్వితమైన ప్రదేశమనీ, ఈ కారణంగానే స్వామి ఇక్కడ శయన ముద్రలో ఆవిర్భవించాడని స్థానికులు చెబుతుంటారు.

పూర్వం ఈ ప్రదేశంలో కూర్చుని ఒక భక్తుడు శ్రీరాముడి భజన చేయడం మొదలుపెట్టాడట. ఆయన అలా భజన చేస్తూ వుండగా హనుమంతుడు మారువేషంలో వచ్చి ఆనందంతో నాట్యం చేసి, ఆ తన్మయత్వంలో తేలిపోతూ అక్కడే పడిపోయాడు. భజనలో నుంచి బయటికి వచ్చిన ఆ భక్తుడు, తన్మయత్వంలో తేలిపోతున్న వ్యక్తిని చూశాడు. అంతటి పరవశాన్ని ఒక్క హనుమంతుడు మాత్రమే పొందగలడని భావించి, ఆయన కాళ్లు పట్టుకుని అక్కడే కూర్చుండిపోయాడు. ఈ లోకంలోకి హనుమంతుడు రాగానే, ఆ ప్రదేశంలో అలాగే ఆవిర్భవించవలసిందిగా కోరాడు. ఆయన కోరికమేరకు హనుమంతుడు ఇక్కడ శయన భంగిమలోనే దర్శనమిస్తూ వుంటాడు ... తన భక్తులను ధన్యులను చేస్తూ వుంటాడు.

More Bhakti Articles