పిలిస్తే పరమాత్ముడు సైతం పలుకుతాడు

పిలిస్తే పరమాత్ముడు సైతం పలుకుతాడు
భక్తులను కాపాడటమే తన ప్రధానమైన కర్తవ్యంగా భగవంతుడు భావిస్తుంటాడు. భక్తులు పిలిస్తే పలకకుండా ఉండలేని పరమాత్ముడు, అనుక్షణం వాళ్లని కనిపెట్టుకుంటూ .. కాపాడుకుంటూ వస్తుంటాడు. భక్తుల అవసరాలను తీరుస్తూ ... ఆపదల నుంచి వాళ్లని గట్తెక్కిస్తూ సంతోషపడిపోతుంటాడు. మహాభక్తుడైన సూరదాస్ విషయంలోనూ ఇది మరోసారి స్పష్టమైంది.

అంధుడైన సూరదాస్ కి కృష్ణుడి ధ్యానం తప్ప మరోధ్యాస వుండేది కాదు. నిరంతరం కృష్ణుడిని కీర్తిస్తూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతూ ఉండేవాడు. చూపులేకపోయినా, మనో నేత్రంతో శ్రీకృష్ణుడి మనోహరమైన రూపాన్ని దర్శిస్తూ పొంగిపోయేవాడు. అలాంటి సూరదాస్ ఒకసారి ఒక నిర్జన ప్రదేశంలో వెళుతూ, ఓ పాడుబడిన బావిలో పడిపోతాడు. తాను చాలా పెద్దగోతిలో పడిపోయిన విషయం ఆయనకి అర్థమైపోతుంది.

అది నిర్మానుష్యమైన ప్రదేశం కావడంవలన, పిలిస్తే పలికేందుకు అక్కడ ఎవరూ ఉండరని ఆయనకి తెలుసు. ఇక ఆ కన్నయ్య తప్ప మరెవరూ తనని కాపాడలేరని తెలుసుకుని కృష్ణుడిని ఆర్తితో పిలుస్తాడు. క్షణాల్లో కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమై, ఆయనని ఆ బావిలో నుంచి బయటికి తీసుకువస్తాడు. అయితే తనని కాపాడినది ఎవరో తెలుసుకోవడం కోసం, వళ్లంతా ప్రేమతో తడుముతాడు సూరదాస్.

ఆయన ఆరాటాన్ని ఆనందంగా గమనిస్తూ కృష్ణుడు అలాగే ఉండిపోతాడు. కృష్ణుడి చేతిలో గల వేణువు తన చేతికి తగలడంతో, తాను ఊహించినట్టుగా వచ్చినది కృష్ణుడేనని సూరదాస్ గ్రహిస్తాడు. తనని కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన పాదాలపై వాలిపోతాడు. అచెంచలమైన ఆయన భక్తి విశ్వాసాలు కృష్ణుడిని కదిలించివేస్తాయి. దాంతో ఆ క్షణం నుంచి సూరదాస్ వెంటే ఉంటూ, ఆయనకి ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకుంటాడు. భక్తుడికీ ... భగవంతుడికి మధ్యగల అనుబంధం ఏ స్థాయిలో వుంటుందో తెలుసుకోవడానికి సూరదాస్ జీవితమే ఒక నిజమైన ఉదాహరణ.

More Bhakti Articles