సదాశివుడు ఎక్కడ వుంటే శ్రీరాముడూ అక్కడే

సదాశివుడు ఎక్కడ వుంటే శ్రీరాముడూ అక్కడే
పురాణాలను పరిశీలిస్తే ... ఆధ్యాత్మిక గ్రంధాలను ఆసక్తికరంగా చదివితే, శివకేశవుల మధ్య గల ఆత్మీయానురాగాలు అర్థమవుతాయి. శివాభిషేకం సమస్త పాపాలను తరిమేస్తుందని శ్రీరాముడు చెప్పగా, రామనామాన్ని మించిన శక్తిమంతమైన మంత్రం మరోకటిలేదని సాక్షాత్తు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పాడు. ఒకరి క్షేత్రానికి ఒకరు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తూ వుంటారు. దీనిని బట్టి శివకేశవుల మధ్యగల అభిమానం, అనుబంధం ఏ స్థాయిలో ఉంటాయనేది గ్రహించవచ్చు.

ఈ నేపథ్యంలో ఇటు రాముడు ... అటు శివుడు కొలువుదీరిన విశిష్టమైన క్షేత్రాలు ఎన్నో కనిపిస్తాయి. అలాంటివాటిలో ఒకటిగా హైదరాబాద్ - గాంధీనగర్ లో గల శివరామాలయం అలరారుతోంది. గర్భాలయంలో సీతారామలక్ష్మణులు ... పరమశివుడు కొలువై వుండటం ఇక్కడి ప్రత్యేకత. సహస్ర లింగాలు మలచబడిన శివలింగాన్ని సీతారామలక్ష్మణులు పూజిస్తూ ఉన్నట్టుగా గర్భాలయ దృశ్యం కనిపిస్తుంది. గర్భాలయానికి ఒకవైపున రాజరాజేశ్వరీ ఆలయం, మరోవైపున గణపతి - కుమారస్వామి మందిరం కొలువుదీరి వుంటాయి.

సువిశాలమైన ప్రాంగణం ... ఆకర్షణీయమైన ముఖమంటపం ... అందమైన నగిషీలు ఆలయ వైభవాన్ని ప్రతిబింబిస్తూ వుంటాయి. విశేషమైన పర్వదినాల్లో శివకేశవులు ఘనంగా పూజలు అందుకుంటూ వుంటారు. ఈ దేవాలయాన్ని దర్శించుకున్న భక్తులు ... ఒకేసారి ఇటు శివ కుటుంబం, అటు సీతారామలక్ష్మణుల అనుగ్రహాన్ని పొందడం తమ అదృష్టంగా భావిస్తూ వుంటారు. శ్రీరాముడి దర్శనం వలన విజయము ... శివయ్య దర్శనం వలన మోక్షం లభిస్తాయని విశ్వసిస్తూ వుంటారు.

More Bhakti Articles