భగవంతుడిని విశ్వసిస్తే లభించనిదేది ?

భగవంతుడిని విశ్వసిస్తే లభించనిదేది ?
అనేక కష్టనష్టాలలో వున్నప్పుడు అనుగ్రహించమంటూ భగవంతుడి పాదాలపై పడటం, అవికాస్తా తీరాక ఆయన్ని మరచిపోవడం జరుగుతుంటుంది. అందుకే భగవంతుడు తన భక్తులకు అడిగినవన్నీ సమకూర్చీ, అవసరాలు తీరిన తరువాత వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందా అని పరీక్షిస్తూ వుంటాడు. ఒక్కోసారి భక్తులే తమ భక్తికి కాలంపెట్టిన కఠిన పరీక్షలకు ఎదురీది, నిజభక్తిని నిరూపించుకుంటూ వుంటారు.

అలాంటి భక్తుల జాబితాలో మనకి 'రుక్మాంగదుడు' ముందువరుసలో కనిపిస్తూ వుంటాడు. శ్రీమహావిష్ణువు భక్తుడైన రుక్మాంగద మహారాజు, తన రాజ్యం సుభీక్షంగా ఉండేందుకుగాను ఆచరించవలసిన విధిని గురించి స్వామిని కోరతాడు. ఆయన సూచన ప్రకారం తాను 'ఏకాదశి వ్రతం' నిర్వహిస్తూ ప్రజలందరితో చేయిస్తుంటాడు. అలా చాలాకాలం గడిచాక ఆ రాజ్యం నుంచి యమలోకానికి ఒక్కరూ రాకపోవడంతో, యమధర్మరాజుకి విషయం అర్థమైపోతుంది.

ఆయన అసహనాన్ని అర్థం చేసుకున్న బ్రహ్మదేవుడు, మోహిని అనే సౌందర్యరాశిని సృష్టించి రుక్మాంగదుడిపైకి ఉసిగొల్పుతాడు. ఆమె వ్యామోహంలో పడిన రుక్మాంగదుడికి, ఏకాదశి వ్రతం నిర్వహించవలసిన సమయం ఆసన్నమైందని కొడుకు గుర్తుచేస్తాడు. ఆ వ్రతాన్ని ఆపుచేయించడానికి వచ్చిన మోహినికి, అతని ధోరణి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఏకాదశి వ్రతం మానుకోమనీ, చేయాలనుకుంటే కొడుకు తల నరికి ఆ పనిని పూర్తిచేయమని అంటుంది మోహిని.

ఏకాదశి వ్రతాన్ని ఆచరించడంకన్నా తనకి ఏదీ ఎక్కువ కాదనీ ... ఎవరూ ఎక్కువకారని కొడుకు తల నరకడానికి సిద్ధపడతాడు రుక్మాంగదుడు. సరిగ్గా ఆ సమయంలోనే అక్కడ ప్రత్యక్షమైన శ్రీమహావిష్ణువు, ఏకాదశి వ్రతం పట్ల ఆయనకి గల భక్తి విశ్వాసాలను మెచ్చుకుంటాడు. మోహిని ఆ విధంగా ప్రవర్తించడానికి గల కారణాన్ని వివరించి, రుక్మాంగదుడి కుటుంబ సభ్యులందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తూ అక్కడి నుంచి అదృశ్యమవుతాడు.

More Bhakti Articles