సింహాద్రి అప్పన్న చందనోత్సవం

సింహాద్రి అప్పన్నకి చందనోత్సవం అంటే ఆయన భక్తులందరికి పండుగ రోజే. రాష్ట్రంలోని భక్తులందరూ ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు సింహాచలం చేరుకుంటూ వుంటారు. ఇక దేశంలోని వివిధ ప్రాంతాలలోని భక్తులు స్వామివారి ఉత్సవ విశేషాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. సాధారణంగా లక్ష్మీనృసింహస్వామి అనగానే భక్తిశ్రద్ధల విషయంలోనూ ... నియమనిష్ఠల విషయంలోను భక్తులు జాగ్రత్త వహిస్తుంటారు.

అలాంటిది ఈ క్షేత్రం విషయానికి రాగానే ఆయనపట్ల భక్తులు చనువును కనబరుస్తూ వుంటారు. ఆ ప్రేమానురాగాలవల్లనే ... ఆ ఆత్మీయత కారణంగానే ఆయన్ని 'అప్పన్న' అని ఇష్టంగా పిలుచుకుంటూ వుంటారు. ఏ కష్టం ... నష్టం వచ్చినా అప్పన్న వున్నాడనే ధైర్యంతో ఆత్రుతగా ... ఆరాటంగా కొండపైకి పరిగెత్తుకువస్తారు. వారి విశ్వాసానికి తగినట్టుగానే వాళ్లని స్వామి అనుగ్రహిస్తూ ఉంటాడు.

సింహం ఆకారంలో గల కొండపై స్వామివారు ఆవిర్భవించిన కారణంగా ఈ క్షేత్రానికి 'సింహాచలం' అనే పేరు వచ్చింది. హిరణ్యాక్షుడిని సంహరించిన 'వరాహ అవతారం' ... హిరణ్య కశిపుడిని సంహరించిన 'నృసింహ అవతారం' కలిసి అవతరించిన ప్రత్యేక మూర్తిగా ఇక్కడ స్వామి కనిపిస్తూ వుంటాడు. ప్రహ్లాదుడి ప్రార్ధన మేరకు ఇక్కడ అవతరించిన స్వామి, ఆయనచే నిత్యపూజలందుకుంటూ కాలక్రమంలో అంతర్హితుడయ్యాడు.

షట్ చక్రవర్తులలో ఒకరైన 'పురూరవుడు' ఊర్వశితో కలిసి ఈ ప్రాంతంలో విహరించడానికి వచ్చాడు. అప్పుడే స్వామి ఆయనకి స్వప్న దర్శనమిచ్చి తన జాడను తెలిపి .. ప్రతిష్ఠించ వలసిందిగా ఆదేశించాడు. అలా ఆయన ఈ ఆలయాన్ని నిర్మించి స్వామివారి ప్రతిమను ప్రతిష్ఠించడం జరిగింది. అయితే అప్పటి వరకూ స్వామి తన రూపం పైకి కనిపించకుండా పుట్టలో చల్లగా వున్నాడు కనుక, ఇకపై కూడా అలాగే తన రూపాన్ని చందనంతో కప్పి ఉంచవలసిందిగా చెప్పాడట. తాను ఆవిర్భవించిన 'వైశాఖ శుద్ధ తదియ' రోజున మాత్రం నిజరూప దర్శనాన్ని కల్పించమని అన్నాడట.

అలా అప్పటి నుంచి ఆ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఈ నిజరూపాన్ని చూడటానికీ ... మనసులో మనోహరమైన ఆ రూపాన్ని పదిలపరచుకోవడానికే, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బారులు తీరుతుంటారు. స్వామివారు వైశాఖ శుద్ధ తదియ రోజున నిజరూప దర్శనం కావించిన అనంతరం, సిద్ధంగా ఉంచబడిన మూడు మణుగుల చందనాన్ని పూస్తారు. అలాగే వైశాఖ .. జ్యేష్ఠ .. ఆషాఢ మాసపు పౌర్ణమి రోజులలో మూడేసి మణుగుల చందనాన్ని అద్దుతారు. అలా ఏడాది పాటు 12 మణుగుల చందనం అంటే .. 480 కేజీల చందనపు పూతతో స్వామివారు దర్శనమిస్తూ వుంటారు.

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతోన్న రెండు అవతారాల్లో ఇక్కడ ఆవిర్భవించడం ... చందనం పూత కారణంగా ఆయన లింగాకారంలో కనిపించడం ... 'త్రిపురాంతకేశ్వరుడు' పేరుతో పరమశివుడు క్షేత్రపాలకుడు కావడం ఇక్కడి ప్రత్యేకతగా చెబుతుంటారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్న భక్తులు దారిద్ర్యం ... దుఃఖం ... అనారోగ్యాల నుంచి విముక్తులై, సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడుపుతారని స్థల పురాణం చెబుతోంది.


More Bhakti News